Raids on Gudumba Bases : 'గ్రామీణ పేదలను కాటేస్తున్న గుడుంబా... బానిసలై కుటుంబాలు ఆగమాగం' శీర్షికతో ఈటీవీ భారత్‌లో మంగళవారం ప్రచురితమైన కథనానికి ఆబ్కారీ శాఖ అధికారులు స్పందించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని కొన్ని కుటుంబాలు గుడుంబాతో కాకావికలమవుతున్న పరిస్థితిని ఈ కథనం కళ్లకు కట్టింది. దానిపై స్పందించిన కాటారం అధికారులు కొర్లకుంట, పెగడపల్లి, ప్రేమ్‌నగర్ గ్రామాల సమీపాల్లోని అటవీ ప్రాంతాల్లో గుడుంబా తయారీ కేంద్రాలపై మంగళవారం దాడులు నిర్వహించారు. 3200 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. ఎస్సై గంగాధర్, సిబ్బంది పాల్గొన్నారు.
Raids on Gudumba Bases News : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మారుమూల మహాముత్తారం మండలంలో ‘ఈనాడు-ఈటీవీ భారత్' క్షేత్రస్థాయిలో పర్యటించగా విస్మయకర విషయాలు కళ్లకు కట్టాయి. ఈ ప్రాంతంలో కొన్నాళ్లుగా బెల్లం విరివిగా లభిస్తుండటం గుడుంబా ఉద్ధృతికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఈ ప్రాంత ప్రముఖ జాతరలో భారీగా వినియోగించిన బెల్లాన్ని వ్యాపారులు ఇటీవల అక్రమంగా దిగుమతి చేసుకొని నాటుసారా తయారీదారులకు అమ్ముతున్నట్లుగా తెలుస్తోంది.
35-40 ఏళ్లలోనే మరణశయ్యపై: మహాముత్తారం మండలం మాదారంలో గుడుంబా ఎన్నో సంసారాల్లో కల్లోలం సృష్టించింది. ఆ మత్తు కారణంగా ఏడాది కాలంలో అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందైతే పదుల సంఖ్యలోనే మృత్యుఒడికి చేరారు. దీనికి బానిసలై పెళ్లిళ్లకు నోచని యువకులూ ఉన్నారు.
మండలంలోని కొర్లకుంట శివార్లు గుడుంబా తయారీకి అడ్డాలుగా మారాయి. ఇక్కడ పలు కుటుంబాలు అదే పనిలో నిమగ్నమయ్యాయి. ఇక్కడి నుంచే పరిసర ప్రాంతాలకు గుడుంబా పంపుతున్నారు. ఈ ప్రాంతంలోని ఇద్దరు సోదరులు ఏళ్ల తరబడి ఇదే దందా నడిపిస్తున్నారు. కొన్ని కుటుంబాల్లో ఉపాధి వనరుగా మార్చుకుని మహిళలు సైతం నాటుసారా కాస్తున్నారు. ఆపై విక్రయకేంద్రాలకు చేరవేస్తున్నారు.
సంబంధిత కథనం: గ్రామీణ పేదలను కాటేస్తున్న గుడుంబా... బానిసలై కుటుంబాలు ఆగమాగం
ఇవీ చదవండి:'వడదెబ్బతో నెలలో 17 మంది మృతి... మంగళవారం ఒక్కరోజే ఆరుగురు'