టీకా(Covid Vaccine).. కొవిడ్ నుంచి రక్షణ ఇస్తుందని మరోసారి నిరూపితమైంది. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జరిపిన పరిశోధనలో వాస్తవమని తేలింది. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ విభాగాధిపతి కిరణ్ మాదల, రేడియాలజీ విభాగాధిపతి మధుసూదన్ రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ సంతోష్ బృందం ఈ పరిశీలన నిర్వహించింది. జీజీహెచ్‌లో ఏప్రిల్ ఒకటి నుంచి 25వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 206 మందిని ఎంపిక చేశారు. వ్యాక్సిన్ తీసుకోకుండా కొవిడ్ బారినపడిన 180 మంది... ఒక గ్రూప్‌గా.. 26 మంది కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వైద్య సిబ్బందిని మరో బృందంగా విభజించారు. వారందరి ఆరోగ్య పరిస్థితి, వైరస్‌తో నెలకొన్న పరిణామాలపై వైద్య బృందం నెలరోజుల పాటు అధ్యయనం చేసింది.
టీకాతోనే రక్షణ..
వైద్య బృందం పరిశీలనలో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 26 మంది సిబ్బంది...... కొవిడ్ బారిన పడినా ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తలేదు. 26 మందికి సీటీస్కాన్ చేయగా... ముగ్గురికి మాత్రమే పాజిటివ్, మిగిలిన 23 మందిలో నెగెటివ్‌గా వచ్చింది. ముగ్గురిలో ఊపిరితిత్తుల వరకు.... స్వల్ప ఇన్ఫెక్షన్ వచ్చింది. మిగతావారిలో వైరస్ ఎలాంటి ప్రభావం చూపలేదు. వారంతా హోం ఐసోలేషన్‌లో ఉంటూ కోలుకున్నారు.
వ్యాక్సిన్ తీసుకోని 180 మందిలో వైరస్ వ్యాప్తి.. 40 మందిలో స్వల్పంగా, 70 మందిలో మధ్యస్థంగా, 50 మందిలో తీవ్రంగా ఉన్నట్లు గుర్తించారు. 89 శాతం మందికి సీటీ స్కాన్‌లో ఇన్‌ఫెక్షన్ పాజిటివ్ వచ్చింది. వ్యాక్సిన్ తీసుకోని వారిలో దాదాపు 120 మందికి ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ సోకింది. వ్యాక్సిన్ తీసుకోని 180 మందిలో 85 మందికి ఆక్సిజన్ బెడ్‌పై చికిత్స అందించాల్సి వచ్చింది. ఇందులో కొందరిని ఐసీయూకు తరలించి, చికిత్స చేయాల్సి వచ్చిందని పరిశీలన బృందం తెలిపింది. వారంతా మహారాష్ట్ర వేరియంట్ డెల్టా వైరస్ దాటిని తట్టుకున్నారు. ఎవ్వరిలోనూ కరోనా పెద్దగా ప్రభావం చూపించలేదు.
వ్యాక్సిన్‌తో ముప్పు తప్పున్..
వ్యాక్సిన్(Covid Vaccine) తీసుకోవడం వల్ల వైరస్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్య బృందం పరిశీలనలో తేలింది. ఈ పరిశోధన నివేదికను....... ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ హెల్త్ అండ్ క్లినికల్ రీసెర్చ్‌లో ఈ వారం ముద్రించారు.
- ఇదీ చదవండి : Vaccine: 'వారిలో కరోనా వైరస్ తీవ్రత తక్కువే'