కరోనా ఎంతో మంది జీవితాలను తలకిందులు చేసింది. చిన్నా చితకా పనులు చేసుకుంటూ పూటగడిపే వారు ఏం చేయాలో తోచని స్థితిలో పడిపోయారు. అయితే ఉద్యోగం పోయినా నిరాశ చెందకుండా.. కొంతమంది యువకులు సొంతంగా ఉపాధి కల్పించుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు పలు చోట్ల రోడ్డు పక్కన చిన్న గుడారం లాంటి స్టాల్ ఏర్పాటు చేసుకొని.. మొబైల్ స్క్రీన్ గార్డులు, బ్యాక్ కేస్‌లు, హెడ్ ఫోన్స్, ఛార్జర్, పెన్ డ్రైవ్‌లు అమ్ముతున్నారు. నిజామాబాద్ ప్రధాన సెంటర్లలో ఎక్కడ చూసినా 'ఎట్ ది రేట్ 69 బోర్డులే' దర్శనమిస్తున్నాయి. నగరంలోనే దాదాపు 20కి పైగా సెంటర్లు ఏర్పాటు చేసుకున్న యువకులు.. బతుకుబండిని లాగుతున్నారు.
రోజుకు రూ.500 వరకు..
ఒక్కో స్టాల్ ఏర్పాటు కోసం రూ.20వేల పెట్టుబడి పెడుతున్నారు. ఎక్కడికైనా తరలించేందుకు వీలుగా ఉండే ఈ స్టాళ్లను.. ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేస్తారు. హోల్‌సేల్ వ్యాపారుల నుంచి.. లేదా నేరుగా ముంబయి వంటి ప్రాంతాల నుంచి సామగ్రి కొంటారు. ఒక్కో మొబైల్ స్క్రీన్ గార్డు మీద రూ.5 నుంచి రూ.10 వరకు మిగులుతోందని యువకులు చెబుతున్నారు. రోజుకు రూ.500 వరకు సంపాదిస్తూ కాలం వెళ్లదీస్తున్నామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మనసు పెడితే..
ఉద్యోగం పోయిందని నిరాశ చెందకుండా మనసు పెడితే ఏదో ఒక ఉపాధి వెతుక్కోవచ్చని ఈ యువకులు చెబుతున్నారు.
ఇవీ చూడండి: వరదల నేపథ్యంలో భాగ్యనగరంలో ఇళ్లు భద్రమేనా?