నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక(local body mlc elections in nalgonda)ల్లో ఏకగ్రీవానికి శతథా యత్నించి.. సాధ్యం కాకపోవడంతో తమ అభ్యర్థిని ఎలాగైనా గెలిపించుకోవాలని తెరాస వ్యూహాలు(trs strategy in mlc elections) రచిస్తోంది. తమ ఓటర్లు చేజారకుండా జాగ్రత్త పడుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పోరును ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న తెరాస.. ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వానికి తావివ్వరాదని భావిస్తోంది. ఉన్న బలాన్ని కాపాడుకుంటూనే.. విపక్ష సభ్యుల నుంచి వచ్చే మద్దతును కూడగట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. మంత్రి జగదీశ్ రెడ్డి ఉమ్మడి జిల్లా నేతలతో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించాలని భావించినా.. అనివార్య కారణాల వల్ల అది సాధ్యపడలేదు. ఒకవేళ అనుకున్నట్లుగా ఈ సమావేశం జరిగి ఉంటే.. మరో రెండ్రోజుల్లో క్యాంపు రాజకీయాలకు తెరలేచేదే. ఉమ్మడి జిల్లాలో జరిగిన హుజూర్నగర్, సాగర్ ఉప ఎన్నికలతో పాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన రీతిలో ఈ పోరులోనూ విజయఢంకా మోగించాలని తెరాస చూస్తోంది.
ఒకట్రెండు రోజుల్లో భేటీ...
స్వతంత్రులుగా బరిలో నిలిచిన విపక్ష అభ్యర్థుల్లో ఒకర్ని తప్పించడానికి వీలులేని పరిస్థితుల్లో ఇక తమ బలగాన్ని పూర్తిస్థాయిలో కాపాడుకునేందుకు గులాబీ పార్టీ తీవ్రస్థాయిలో సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ ఛైర్మన్లతో సమన్వయ సమావేశం నిర్వహిస్తోంది. వాస్తవానికి ఈ నెల 27న నిర్వహించాల్సి ఉన్నా.. కొందరు నేతల గైర్హాజరు వల్ల ఈ భేటీని ఒకట్రెండు రోజుల్లో చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ భేటీ ఆధారంగా చేపట్టే తర్వాతి సమావేశాలు ఉమ్మడి జిల్లా పరంగా ఉంటాయా..? లేక కొత్త జిల్లాల లెక్కన ఉంటాయా..? అన్నది తేలాల్సి ఉంది. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నియోజకవర్గం వారీగా భేటీలు నిర్వహిస్తే ఓటర్లందరికీ చేరువయ్యే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల నుంచి వినపడుతోంది.
కార్యాచరణపై దృష్టి...
ముందు ఊహించినట్లుగా ఏకగ్రీవమైతే ఓటర్లను కలుసుకునే అవసరం ఉండేది కాదు. ప్రస్తుతం ఎన్నిక అనివార్యమైన పరిస్థితుల్లో కారు గుర్తుకు పడే ఓట్లు అత్యంత ప్రాధాన్యత సంతరించుకోనున్నాయి. గత ఎన్నికలతో పోల్చి చూసే పరిస్థితి బాలేదన్న భావన నెలకొంది. అప్పటి.. ఇప్పటి పరిణామాలకు తేడా స్పష్టంగా కనిపిస్తోందన్న భావన పార్టీ శ్రేణుల్లో ఏర్పడింది. ఒకవేళ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తే ప్రతి ఓటరు అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకతప్పదు. నిధులు లేవన్న కారణంతో అచేతనంగా మారిన తమపై దృష్టిసారించాలని ఇప్పటికే భారీగా వినతులు వచ్చాయి. ఈ వాతావరణంలో గంపగుత్తగా ఓట్లు పడతాయన్న భరోసాను ప్రతి నియోజకవర్గ ముఖ్య నేత ఇవ్వాల్సి ఉన్న పరిస్థితుల్లో అసంతృప్తులు లేకుండా ఓటర్లను మచ్చిక చేసుకోవాల్సిన అవసరం ఉంది.
క్యాంపులపై కన్నేసి...
అతిత్వరలో నిర్వహించే సమన్వయ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ ఛైర్మన్లతో మంత్రి జగదీశ్‌రెడ్డి హైదరాబాద్‌లో భేటీ కానున్నారు. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కన్నేయడంతో పాటు క్యాంపు రాజకీయాలకు కూడా తెరలేచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మొత్తం 1271 ఓట్లలో 900కు పైగా బలం తమకు ఉందని తెరాస ఆశాభావంతో ఉంది. ఆ ఓటర్లంతా తమ కనుసన్నల్లోనే ఉండాలన్న భావనతో క్యాంపుల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్వతంత్రులుగా బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు బలమైనవారిగా ప్రచారం సాగటం.. వారికి కాంగ్రెస్ నేతల అండదండలు ఉండటం వల్ల తమ బలగంలో కొంతైనా ప్రత్యర్థి వైపు చూసే అవకాశం లేకపోలేదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే.. సమన్వయ సమావేశం ముగియగానే అధికార పార్టీ ఓటర్లను క్యాంపులకు తరలించనున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: