నల్గొండ పట్టణానికి కూతవేటు దూరంలో చందనపల్లికి సమీపంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డు స్థానిక ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. పట్టణ ప్రజల నుంచి సేకరించిన చెత్తను ఇక్కడే పడేస్తారు. కాకపోతే మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో ఇది ఎప్పుడు రావణ కాష్టంలా రగులుతూనే ఉంటుంది. చెత్తను శుద్ధి చేయకుండానే సిబ్బంది కాల్చేస్తున్నారు. వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు. ఫలితంగా స్థానికులు నానా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తోంది.
జన జీవనానికి, వాహనదారులకు పొగ...
వాతావరణం కాలుష్యం భారీ నుంచి ప్రజలను రక్షించడానికి చర్యలు తీసుకోవాల్సిన మున్సిపాలిటీ యంత్రాంగం అందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు లేకపోలేదు. పట్టణంలో రోజుకు 75 వేల మెట్రిక్ టన్నుల చెత్తను శేషమ్మ గూడెం డంపింగ్ యార్డుకు తరలిస్తారు. పూర్తి స్థాయిలో రీసైక్లింగ్ చేయకుండానే వ్యర్థాలను పారబోస్తునారు. పోగైన వ్యర్థాలను నెలల కొద్ది నిల్వ ఉంచడం వల్ల గ్యాస్ ఆధారిత రసాయనాలు ఉత్పత్తి అవుతున్నాయి. డంపింగ్ యార్డు నుంచి వచ్చే దట్టమైన పొగతో 565 జాతీయ రహదారి కనబడకుండా పోతుంది. నల్గొండ నుంచి నకిరేకల్ వెళ్లే ప్రయాణికులు వణికిపోతున్నారు. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాతావరణ కాలుష్యంగా మారడంతో పరిసర ప్రాంతాలైన చందనపల్లి, శేషమ్మ గూడెం, ఖాజిరమరాం, పాన్గల్ ప్రజలు ఆనారోగ్యాలు భారిన పడుతున్నారు.
కనిపించని నియంత్రణ చర్యలు...
డంపింగ్ యార్డులో ప్రతి ఏటా వేసవిలో దవానంలా వ్యాపిస్తున్న మంటలను ఆర్పేందుకు యార్డులో ప్రత్యేకంగా నీటి సౌకర్యం కల్పించాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రజల నుంచి ఫిర్యాదులు అందినప్పుడు మాత్రమే అధికారులు స్పందించి తూతూ మంత్రంగా చర్యలు చేపడుతున్నారు.. కానీ.. శాశ్వత పరిష్కారం మాత్రం తీసుకోవడం లేదు.
రోడ్డు ప్రమాదాలు...
నల్గొండ, నకిరేకల్, చందనపల్లి, పెద్ద సూరారం, చిన్న సూరారం, బొల్లేపల్లి, మొదలైన గ్రామాలకు నిత్యం వందల సంఖ్యలో ప్రయాణికులు ఈ రోడ్డు మార్గాన రాకపోకలు జరుపుతుంటారు. రోడ్డుకు సుమారు రెండు వందల మీటర్ల వరకు దట్టమైన పొగ కమ్ముకొని ఉడంటం వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. అదే కాకుండా డంపింగ్ యార్డులోని వ్యర్ధాలను అలవాటైన కుక్కలు, పందులు రోడ్లపై సంచరిస్తూ.. వాహనాలకు అడ్డురావడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు.
ఇదీ చూడండి: