ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లాలో వరికోతలు మొదలయ్యాయి. కోతలు పూర్తైన ధాన్యం కల్లాల్లోకి చేరుతోంది. పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు తెరుచుకోకపోవడం రైతులకు శాపంగా మారింది.
అరకొరగానే కేంద్రాలు
పాలమూరు వ్యాప్తంగా వరి ఏడున్నర లక్షల ఎకరాల్లో సాగుచేశారు. దిగుబడి సుమారు 16 లక్షల మెట్రిక్ టన్నులుగా వస్తుందని అంచనా. మార్కెట్ అవసరాలు పోను 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసింది. 800లకు పైగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం సన్నద్ధమవుతున్నా... అరకొరగానే కేంద్రాలు ప్రారంభించారు. పంట ఆరబెట్టిన రైతులు వానొస్తే నష్టపోతామని ఆందోళన చెందుతున్నారు.
కనీస మద్దతు ధర దక్కకపోయినా..
వరికోతలు కోసిన రైతులు కల్లాలున్న వాళ్లు అక్కడే ధాన్యాన్ని ఆరబెడుతుండగా లేని వాళ్లు రోడ్లపైనే వడ్లు ఆరబోస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లేక ప్రైవేటు వ్యాపారులకు 1400 నుంచి 1500 రూపాయలకు క్వింటా చొప్పున ధాన్యాన్ని అమ్మేస్తున్నారు. తేమశాతం, నాణ్యతతో పనిలేకుండా కోసిన చేలోనే వ్యాపారులు కొనుగోలు చేస్తుండటంతో కనీస మద్దతు ధర దక్కకపోయినా వారికే అమ్మేందుకు మొగ్గు చూపుతున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో..
ఉమ్మడి నల్గొండ జిల్లా సాగర్ ఆయకట్టు పరిధిలో 3 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. దిగుబడి ఆశాజనకంగా ఉన్నప్పటికీ ఆ స్థాయిలో మిల్లుల సామర్థ్యం పెరగకపోవడం వల్ల ధాన్యం నిల్వలు పెరిగిపోతున్నాయి. పంట అమ్ముకునేందుకు రోజుల కొద్దీ అన్నదాతలు వేచిచూడాల్సి వస్తోంది. అప్పులు భారమైన కర్షకులు ప్రైవేటు వ్యాపారులకు పంటను అమ్మడం వల్ల గిట్టుబాటు ధర దక్కక నష్టాలు చవిచూస్తున్నారు. వరికోతలకు టోకెన్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగి ధాన్యం మిల్లులకు తెస్తే మూడు రోజులు పడిగాపులు కాయాల్సి వస్తోందని వాపోతున్నారు. ధాన్యం రంగు మారడం, తేమశాతం పేరుతో క్వింటా ధాన్యానికి 1750 నుంచి 1800 రూపాయల్లోపు మాత్రమే చెల్లిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎకరానికి దాదాపు పెట్టుబడే 40 వేలు అవుతోందని ఆ మేరకు ఆదాయం రావడం లేదని అన్నదాత ఆవేదన చెందుతున్నారు.
గ్రామగ్రామాన కొనుగోలు కేంద్రాలు తెరిస్తేనే..
ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు మేల్కొని గ్రామగ్రామాన కొనుగోలు కేంద్రాలు తెరిస్తేనే ధాన్యం అమ్మకాలు సజావుగా సాగుతాయి. మిల్లర్లతో సమస్యలు లేకుండా రవాణా, గోనె సంచులు సిద్ధం చేస్తేనే మేలు జరుగుతుందని రైతులు అంటున్నారు.
ఇదీచూడండి: Farmers Problems: అన్నదాతల అరిగోసలు.. కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు