Yadadri Temple News: ఒక్క గంట పాటు కురిసిన వర్షానికే అతలాకుతలమైన యాదాద్రి క్షేత్రంలో ప్రస్తుత పరిస్థితికి ఇంజినీరింగ్ వైఫల్యమే కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వందల కోట్ల రూపాయలతో క్షేత్రంలో చేపట్టిన రహదారి అభివృద్ధి పనుల్లో నిత్యం పర్యవేక్షణ కొరవడటం వల్ల చిన్న వానలకే రోడ్లు కుంగిపోవడం, ఎక్కడికక్కడ వరద నీరు రహదారులపై ప్రవహించడంతో భక్తులు ఆవేదన చెందుతున్నారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి సమాచారం సేకరించకుండా ఏకపక్ష నిర్ణయాలతో యాదాద్రి అభివృద్ధి ప్రాధికార సంస్థ(యాడా) అధికారులు పనులు చేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
యాడాలో సభ్యత్వం లేని ఓ అధికారి పెత్తనం తీసుకొని అభివృద్ధి పనుల్లో నిత్యం కలుగజేసుకోవడంతో పాటు ప్రభుత్వం ఆమోదించిన ఆకృతులను కాకుండా తనకు నచ్చినట్లు పనులు చేయించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రూ.2 వేల కోట్లతో చేపట్టిన ఈ ఆలయ పునర్‌నిర్మాణంలో అణువణువూ సీఎం కేసీఆర్ పరిశీలించినా క్షేత్రస్థాయిలో అమలు ఇష్టారాజ్యంగా సాగింది. హడావుడిగా సాగిన పనుల వల్ల ప్రస్తుతం భక్తులకు, స్థానికులకు గానీ పూర్తి స్థాయిలో ఉపయోగపడని పరిస్థితి నెలకొంది. ప్రధానాలయం, మండపాలు, క్యూకాంప్లెక్స్, అష్టభుజి ప్రాకారమండపం, లిఫ్ట్‌తో సహా పలు మార్గాల్లో వర్షపునీరు చేరడంతో రానున్న వానాకాలంలో పరిస్థితి ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది.
స్థానిక పరిస్థితులు అంచనా వేయలేక... ప్రస్తుతం కొండ చుట్టూ 5.5 కి.మీ. పొడవుతో చేపట్టిన వలయ రహదారి (రింగురోడ్డు)లో గతంలో పొలాలు ఉండేవి. రహదారి నిర్మాణానికి గ్రానైట్ కంకరను ఎక్కువగా వేసి పరిస్థితులకు తగ్గట్లు క్యూరింగ్ చేయాలని స్థానిక ప్రభుత్వ ఇంజినీర్లు సూచించగా.. గుత్తేదారు సంస్థకు చెందిన ఇంజినీర్లతోనే ఓ అధికారి మొత్తం పనులు చేయించారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. స్థానిక పరిస్థితులను అంచనా వేయడంలో గుత్తేదారు సంస్థలు, స్థానిక ప్రభుత్వ ఇంజినీర్లతో కలిసి పనిచేయలేదని, అందుకే చిన్నపాటి వర్షానికే ఈ పరిస్థితి తలెత్తిందని ఓ అసిస్టెంట్ ఇంజినీరు వెల్లడించారు. ‘‘పనుల్లో నాణ్యతపై మేం చాలాసార్లు మా పైఅధికారులకు హెచ్చరించాం. అభివృద్ధి పనుల్లో కీలకంగా వ్యవహరించిన అధికారి మా మాట లెక్కపెట్టేవారు కాదు. ఆ దేవుడే వర్షం రూపంలో వచ్చి పనుల నాణ్యత ఎలా ఉందో ప్రజలకు చూపించారు’’ అని క్షేత్రాభివృద్ధిలో కీలకంగా పనిచేసిన అధికారి ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు.
పరిస్థితులపై సీఎం ఆరా!.. యాదాద్రిలో పరిస్థితిపై సీఎం కేసీఆర్.. దేవాదాయశాఖ కమిషనర్, దేవస్థానం ఉన్నతాధికారులను గురువారం ఆరా తీసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పనుల్లో నాణ్యతాలోపంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. నాణ్యతలేమితో పనులు చేపట్టిన గుత్తేదారు సంస్థలను బ్లాక్‌లిస్టులో పెట్టాలని ఆదేశించినట్లు సంబంధితవర్గాలు వెల్లడించాయి.
ఇదీ చదవండి:భారీ వర్షానికి తడిసి ముద్దయిన యాదాద్రి... క్యూ కాంప్లెక్స్‌లోకి వర్షపునీరు