బహిరంగ, ఇంటింటి ప్రచారానికి తెరపడినట్లే. అభ్యర్థులు గెలుపు బాధ్యతను స్థానిక నేతలకు అప్పగించి ఓట్ల లెక్కల్లో మునిగి తేలుతున్నారు. గత పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లు, పార్టీలు, అభ్యర్థుల వారీగా అంచనా వేస్తూ... ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రామాల్లో బలమైన సామాజిక వర్గాలు, పలుకుబడి ఉన్న నాయకులపై దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మహిళ, యువత, మైనార్టీలే లక్ష్యంగా మంత్రాంగం నడుపుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో లెక్కలు ఇలా ఉన్నాయి.
తోడైన వలస బలం
మహబూబ్‌నగర్ లోక్‌సభ అధికార పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి గెలుపు బాధ్యతను మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆరుగురు ఎమ్మెల్యేలు భుజానికెత్తుకున్నారు. 2014 ఎన్నికల్లో తెరాసకు 3లక్షల 34వేల 228 ఓట్లు పోల్ కాగా... 2018 శాసనసభ ఎన్నికల్లో నియోజకవర్గ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్థులకు 5లక్షల 77వేల ఓట్లు పడ్డాయి. సిట్టింగ్ ఎంపీ జితేందర్‌రెడ్డి పార్టీని వీడటం, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు లక్ష పోయినా.. లక్షకు పైగా మెజారిటీతో గెలుస్తామన్న ధీమాతో ఉన్నారు. నాగర్‌కర్నూల్‌లో రాములు గెలుపు కోసం మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. 2014లో తెరాసకు 4లక్షల 3వేల ఓట్లు పడ్డాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులకు 6లక్షల 35వేల ఓట్లు పోలయ్యాయి. కొల్లాపూర్ నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బీరం హార్షవర్ధన్ రెడ్డి కూడా తెరాసకు మద్దతివ్వటం వల్ల... బలం పెరిగే అవకాశం ఉన్నట్లు ఆశిస్తున్నారు.
హెచ్చుతగ్గుల్లో హస్తం
కాంగ్రెస్ కూడా పాలమూరులో రెండు పార్లమెంటు నియోజకవర్గాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మహబూబ్‌నగర్ నుంచి 2014లో జైపాల్ రెడ్డి కేవలం 2వేల ఓట్లతో ఓడిపోయారు. ఆయనకు 3లక్షల 31వేల ఓట్లు రాగా... 2018 శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థులకు 3లక్షల 48వేల ఓట్లు వచ్చాయి. మహబూబ్‌నగర్‌లో బీఎస్పీ నేత ఇబ్రహీం, నారాయణపేటలో శివకుమార్ రెడ్డి, షాద్‌నగర్‌లో శంకర్ కాంగ్రెస్‌లో చేరడం అదనపు బలంగా మారింది. శాసనసభ ఎన్నికల్లో శివకుమార్ రెడ్డికి 53వేలు, ఇబ్రహీంకు 21వేలు, వీర్లపల్లి శంకర్‌కు 27వేల ఓట్లు వచ్చాయి. తెజస, తెదేపా, వామపక్షాలు, మైనారిటీ ఓట్లతో పాలమూరుపై జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ఏకైక సిట్టింగ్ స్థానమైన నాగర్ కర్నూలును నిలుపుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. గతంలో పార్టీ అభ్యర్థి నంది ఎల్లయ్య 4లక్షల 19వేల ఓట్లు పొంది విజయం సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు 4లక్షల 42వేల ఓట్లు వచ్చినప్పటికీ... డీకే అరుణ, బీరం హర్షవర్దన్‌రెడ్డి పార్టీని వీడటం ఓటుబ్యాంకుపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ మేనిఫెస్టో, మల్లు రవికి ఉన్న మంచిపేరు ఓట్లు కురిపించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
చేరికలతో పుంజుకున్న కమలం
మహబూబ్‌నగర్‌పై కన్నేసిన భాజపా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. 2014లో నాగం జనార్దన్ రెడ్డికి 2లక్షల 72వేల ఓట్లు పడ్డాయి. కానీ ఇటీవల తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 65వేల ఓట్లు మాత్రమే పోలయ్యాయి. డీకే అరుణ, ఎంపీ జితేందర్ రెడ్డి, డోకూరి పనన్ కుమార్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి చేరికతో ఒక్కసారిగా కమలం బలం పెరిగింది. మోదీ ఇమేజ్, పట్టణ ప్రాంత ఓటర్లు, ఉద్యోగులు, యువతపై ఆశలు పెట్టుకుంది. నాగర్ కర్నూల్లో అసెంబ్లీ అభ్యర్థులకు 86వేల ఓట్లు రాగా... డీకే అరుణ చేరికతో ఓట్లశాతం పెరిగుతుందని ఆశిస్తున్నారు.
ఇవీ చూడండి: వేయిస్తంభాలాటలో గెలుపెవరిదో?