వనపర్తి జిల్లా పరిధిలోని పెద్దమందడి మండల కేంద్రానికి సంబంధించిన పంచాయతీ కార్యదర్శి మహేశ్ యాదవ్పై.. స్థానికంగా ఉన్న కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసి.. చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వనపర్తి జిల్లా పరిధిలోని 255 మంది కార్యదర్శులు శుక్రవారం విధులు బహిష్కరించారు. కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. గ్రామస్థాయిలో ప్రభుత్వ పరంగా చేపట్టే ప్రతి అభివృద్ధి పనికి గ్రామ కార్యదర్శులనే బాధ్యుల్ని చేస్తూ.. ఉన్నతాధికారుల షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పని ఒత్తిడి ఎక్కువ కావడం వలన పంచాయతీ కార్యదర్శులు వ్యక్తిగత జీవితం సమస్యగా మారుతోందని.. ప్రభుత్వం స్పందించి పంచాయతీ కార్యదర్శులపై పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేశారు. వెంటనే కార్యదర్శులకు ఆరోగ్య భద్రతతో పాటు అన్ని విధాల ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి పనులలో కేవలం కార్యదర్శులనే బాధ్యులు చేయకుండా సంబంధిత సర్పంచ్లు, వార్డు సభ్యులను సైతం భాగస్వామ్యం చేయాలని కోరారు. పెద్దమందడి పంచాయతీ కార్యదర్శిపై దాడికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు.