ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టుల నీటి లభ్యత దృష్ట్యా.. ఎక్కువ ఆయకట్టును సాగుచేసుకోవాలని సాగునీటి సలహా మండలి సమావేశం తీర్మానించింది. 2020-21 రబీ సీజన్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల కింద 3,97,000 ఎకరాలకు సాగునీరు అందించాలని బోర్డు నిర్ణయించింది. వనపర్తి జిల్లా నాగవరంలో నిర్వహించిన ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి సలహా బోర్డు సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్షత వహించారు.
వానాకాలం పంటలు, ఒకే రకమైన పంట వేసుకున్న రైతులకూ వారబందీ పద్ధతిలో నీరిచ్చేందుకు నిర్ణయం తీసుకున్నాం. రాబోయే రోజుల్లో జూరాల ఎడమ కాలువ డి-20 తర్వాత సింగోటం, గోపాల్దిన్నె రిజర్వాయర్ల నుంచి లింక్ కెనాల్ ద్వారా సాగునీరు అందించే అంశాన్ని పరిశీలించాలి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా ప్రతిపాదిత ఆయకట్టు మొత్తానికి సాగునీరు అందించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు. అవసరమైతే జూరాల, భీమా పథకాలకు కూడా కల్వకుర్తి ఎత్తిపోతల నీటిని ఇచ్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ఇంజినీర్లు పరిశీలించాలి. వర్షాల వల్ల దెబ్బతిన్న సాగునీటి ప్రాజెక్టుల పనులకు టెండర్లు లేకుండానే నిర్వహించేందుకు ప్రభుత్వం ఇదివరకే ఉత్తర్వులు జారీచేసింది. జాప్యం లేకుండా పనులు పూర్తి చేయాలి.
-మంత్రి నిరంజన్‌రెడ్డి
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కింద రబీ సీజన్లో 32,500 ఎకరాలకు, ఆర్డీఎస్ కింద 20 వేల ఎకరాలకు, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కింద ప్రస్తుతం ఉన్న 40 వేల ఎకరాలతో పాటు రబీలో మరో 30 వేల ఎకరాలకు, భీమా పథకం కింద 23,650 ఎకరాలకు, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల నుంచి 12 వేల ఎకరాలకు సాగు నీరందించాలని నిర్ణయం తీసుకున్నారు.
వ్యవసాయ, జలవనరుల శాఖ అధికారులు సమన్వయం చేసుకొని.. సాగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలి. ప్రతి రిజర్వాయర్ కింద ఎంత నీరు అందుబాటులో ఉంది.. ఎన్ని రోజులు నీరు విడిచిపెట్టాలనే విషయమై ప్రణాళిక రూపొందించుకోవాలి. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీటిని వినియోగించే విషయంపై ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి.. ఇంజినీర్లతో పాటు రైతులకు ఆ విషయాలను చెప్పాలి. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కింద మార్చి రెండో వారం నుంచి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించాలి. జూరాల, కోయిల్‌సాగర్ ఎత్తుపెంచే విషయం ఇదివరకే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాం.
-మంత్రి శ్రీనివాసగౌడ్
ఇవీచూడండి: కాళేశ్వరం విస్తరణ పనులపై ఎన్జీటీలో ధిక్కరణ పిటిషన్