మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ సరిహద్దుల్లో శుక్రవారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. శనివారం ఉదయం 7 గంటల వరకు 13.6 సెంటీమీటర్ల వర్షం నమోదైనట్లు అధికారులు గుర్తించారు. కోయిల్ సాగర్ జలాశయానికి సరిహద్దు మండలాలైన కోయిలకొండ, ధన్వాడ, నారాయణపేట, కోస్గి, మద్దూరు మండలాలలో భారీ వర్షం కురిసింది. ఫలితంగా భారీగా వరద నీరు కోయిల్‌సాగర్ జలాశయానికి వచ్చి చేరుతోంది. వచ్చిన వరదను వచ్చినట్టుగా.. గేట్లెత్తి నీటిని కిందికి వదులుతున్నారు.

దేవరకద్ర మండలంలోని కౌకుంట్ల చెరుకు భారీగా వరద రావడంతో... కౌకుంట్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కౌకుంట్ల-ఇస్లాంపల్లి గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. చిన్న చింతకుంట మండలంలో భారీ వర్షపాతం నమోదు కావడంతో.. చిన్నవడ్డెమాన్ - చిన్నచింతకుంట, నెల్లికొండి - సీతారాంపేట, పెద్దవడ్డెమాన్- దమజ్ఞానపూర్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఇవీ చూడండి: 6.74లక్షల ఎకరాలకు సాగు నీరే లక్ష్యం... సీతారామతో సాధ్యం