మహబూబ్‌నగర్ జిల్లాలో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం వినూత్న పద్ధతులను అనుసరిస్తున్నది. జనాలు ఇంట్లోంచి బయటకు రాకుండా ఇంటింటికి తిరిగి తాజా కూరగాయలు, నిత్యావసరాలు అందించే సేవలను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు.
మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లో ఇంటికే తాజా కూరగాయలు అందించే ఎం3 ఫ్రెష్ ఆన్‌లైన్ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. దిల్లీ మర్కజ్‌కు పోయి వచ్చిన వారిలో ఎక్కువ సంఖ్యలో హైదరాబాద్ తర్వాత మహబూబ్‌నగర్‌లోనే ఉన్నారని.. అయినా సమిష్టి కృషి వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టామన్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఆన్‌లైన్ సేవలు, నిత్యావసర సరుకుల పంపిణీ, ఎక్కువ సంఖ్యలో రైతు బజార్‌లు, టెలీమెడిసిన్ వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. అయినప్పటికీ ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోకుండా రోడ్లపైకి వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాజా కూరగాయలు, సరుకులు, పండ్లు కూడా ఫోన్ చేస్తే ఇంటికి చేరవేసే ఎం3 ఫ్రెష్ కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. జిల్లాలో మరిన్ని కేసులు నమోదు కాకుండా.. లాక్‌డౌన్ ఎత్తివేసే వరకు అందరూ ఇంటికే పరిమితమవ్వాలని సూచించారు. అనంతరం రెవెన్యూ సమావేశ మందిరంలో వైద్యులతో సమీక్షించిన మంత్రి.. వారికి మెడికల్ కిట్లు అందజేశారు.
ఇదీ చూడండి: దేశంలోని పరిస్థితులపై కాంగ్రెస్ 'సలహా కమిటీ'