'సార్.. నా భూ సమస్యను పరిష్కరించండి.. నా తప్పుంటే చెప్పండి' అంటూ ఓ రైతు అదనపు కలెక్టర్ కాళ్లపై పడి వేడుకున్న ఘటన మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర తహసీల్దార్ కార్యాలయంలో జరిగింది. శుక్రవారం పల్లె ప్రకృతి వనం ప్రగతిని సమీక్షించేందుకు అదనపు కలెక్టర్ సీతారామారావు రాగా.. దేవరకద్రకు చెందిన రైతు బల్సుపల్లి ఆదిహన్మంతురెడ్డి ఆయన కాళ్లపై పడ్డారు.
తనకు బల్సుపల్లి శివారులో సర్వే నంబరు 202 అ(1)లో 1.50 ఎకరాలు, సర్వే నంబరు 204 అలో 0.53 ఎకరాలు ఉంటే.. ధరణి పోర్టల్‌లో సర్వే నంబరు 204 అలోని 0.53 ఎకరాలు మాత్రమే చూపిస్తోందని, మరో సర్వేలో 1.50 ఎకరాల భూమి కనిపించడం లేదని ఆవేదన చెందారు. దయచేసి తన భూమి మొత్తం 2.03 ఎకరాలు ధరణి పోర్టల్‌లో నమోదు అయ్యేలా చూడాలని వేడుకున్నారు.
దీనిపై స్పందించిన అదనపు కలెక్టర్.. తహసీల్దార్ జ్యోతిని అడిగి సమస్యను తెలుసుకున్నారు. ఆర్డీవో ఆధ్వర్యంలో విచారణ చేసి న్యాయం జరిగేలా చూస్తానని రైతుకు హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: శరద్ పవార్ని కలిసిన మంత్రి నిరంజన్ రెడ్డి... వ్యవసాయంపై ఆరా