కొద్దిరోజులుగా తాను పార్టీ మారుతున్నానంటు జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టత ఇచ్చారు. పార్టీ మార్పు వార్తల్లో నిజం లేదన్నారు. పార్టీ మారే ఉద్దేశం కూడా తనకు లేదని తేల్చి చెప్పారు.
రాజకీయాల్లో నీతి నిబద్ధతకు కట్టుబడి ఉన్నానన్న తుమ్మల.. సీఎం కేసీఆర్‌తోనే తన ప్రయాణమని వెల్లడించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి కృషి చేశానని వివరించారు. ఖమ్మం జిల్లాకు కేసీఆర్ పెద్దఎత్తున నిధులు ఇచ్చారని గుర్తు చేశారు.
40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో నీతిబద్దంగా ఉన్నా. పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలు నిజం కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ సామర్థ్యంలో తెలంగాణ అభివృద్ధి చెందింది. ఆయనతోనే ప్రయాణం సాగిస్తా. దిల్లీలో తెరాస కార్యాలయం శంకుస్థాపనలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నా. 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో నీతికి కట్టుబడి ఉన్నా. ఖమ్మం జిల్లాను రూ.44 వేల కోట్లతో అభివృద్ధి చేశాం. భక్త రామదాసు సీతారామ ప్రాజెక్టుతో రైతులకు రెండు పంటలు పండే అవకాశం కల్పించాం. జాతీయ రహదారులతో రెండు జిల్లాలకు ఉజ్వల భవిష్యత్తు పనులు కొనసాగిస్తున్నాం. ఖమ్మం జిల్లాకు ప్రతి పథకానికి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చారు సీఎం కేసీఆర్. - తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రి
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలంలోని చెన్నారం, శుద్ధపల్లి గ్రామాల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. చెన్నారం గ్రామ సర్పంచి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.
గతంలోనూ వార్తలు.. సీపీకి ఫిర్యాదు.
గతేడాది కూడా తుమ్మల పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలపై తుమ్మల సీరియస్ అయ్యారు. నాటి సీపీ తఫ్సీర్ ఇక్బాల్‌ని కలిసి సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై ఫిర్యాదు చేశారు. పార్టీ మారుతున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పాలేరులో తనను ఓడించిన వారే.. ప్రస్తుతం తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
సంబందిత కథనం: 'ప్రభుత్వాన్ని, పార్టీని అప్రదిష్ఠపాలు చేసేందుకే నాపై ఆరోపణలు'