ఖమ్మం జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కోసం ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన చేశారు. హైదరాబాద్ నుంచి నేరుగా ఖమ్మానికి చేరుకున్న కేటీఆర్... మంత్రులు ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ ఎంపీ నామా నాగశ్వరరావు తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. తొలుత ఐటీ హబ్ రెండో దశ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పలు సంస్థలకు ఒప్పంద పత్రాలు అందజేశారు. పలువురికి ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. శ్రీశ్రీ సర్కిల్ నుంచి కొత్త కలెక్టరేట్ వరకు నాలుగు వరసల రహదారికి శంకుస్థాపన చేశారు. టేకులపల్లిలోని వెయ్యి రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు. 25 కోట్లతో నిర్మించిన అధునాతన బస్టాండ్‌ను ప్రారంభించారు. కాల్వొడ్డు వద్ద వైకుంఠథామాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో మంత్రి సమక్షంలో ఖమ్మం, మధిరకు చెందిన కాంగ్రెస్ నాయకులు తెరాసలో చేరారు.
దేశం గర్వించే విధంగా ఐటీ రంగంలో తెలంగాణ దూసుకుపోతుందని కేటీఆర్ వెల్లడించారు. దేశంలోని పెద్దపెద్ద నగరాలను పక్కకునెట్టి హైదరాబాద్‌కి ఐటీ పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని కేటీఆర్ వివరించారు. ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ విస్తరిస్తున్నామన్న మంత్రి త్వరలో నల్గొండ, సిద్దిపేట, రామగుండంలో ఐటీ హబ్ ల నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఖమ్మం సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్... ఇతోధికంగా సాయపడుతున్నారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ హర్షం వ్యక్తం చేశారు.
ఇక త్వరలోనే ఎన్నికలు జరగనున్న ఖమ్మం నగరపాలకంలో చేసిన అభివృద్ధిని చెప్పుకుంటూ ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. పనిచేసే ప్రభుత్వాన్నిప్రజలు ఆదరిస్తారన్న నమ్మకం ఉందన్న కేటీఆర్.. మరోసారి తెరాస పాలకవర్గం ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం, సత్తుపల్లి అభివృద్ధికి నిధులు కేటాయించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో కేటీఆర్‌తో కలిసి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాగా.. సత్తుపల్లి హెలిప్యాడ్ వద్ద మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేటీఆర్‌కు శాలువా కప్పి సత్కరించారు.