రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా అడవి జంతువుల బెడద మరింత తీవ్రమైంది. అటవీ ప్రాంతాల్లో ఉన్న గ్రామల్లో పంటలకు అపార నష్టం కలిగిస్తున్నాయి. అడవి పందులైతే పంట పొలాల్లో తిరుగుతూ పూర్తిగా ధ్వంసం చేస్తున్నాయి. దీంతో పంటల దిగుబడులపై తీవ్ర ప్రభావమే చూపుతోంది. ముఖ్యంగా వరి, మొక్కజొన్న, పత్తి, చెరకు, కూరగాయ పంటలు అటవీ జంతువుల పాలవుతున్నాయి. అనేక వ్యయ ప్రయాసాల కోర్చి సాగు చేసిన పంట కాపాడుకోవడానికి అన్నదాతలకు మరిన్ని కష్టాలు పడాల్సివస్తోంది. ఈ పరిస్థితిపై ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయం నాలుగేళ్లుగా అనేక పరిశోధనలు చేసి.. ఓ కొత్త యంత్రాన్ని రూపకల్పన చేసింది.
ఏ శబ్దాలకు ఏ జంతువులు భయపడతాయో..
బయో ఎకోస్టిక్ యంత్రంతో అడవి జంతులకు చెక్ పెట్టవచ్చని జయశంకర్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరికరంలో కొన్ని జంతువుల శబ్దాలను ప్రతిధ్వనించేలా ఏర్పాట్లు చేశారు. ఏ శబ్దాలకు ఏ జంతువులు భయపడతాయో అటువంటి శబ్దాలను క్రోడీకరించి.. పరికరంలో అమర్చారు. పంట పొలాల్లోకి జంతువులు వచ్చినప్పుడు ఈ పరికరం నుంచి వచ్చే శబ్దాలకు అవి పారిపోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ శబ్దాలు దాదాపు 3 ఎకరాల మేర వినిపిస్తాయని, రాత్రి వేళల్లో ఐతే 10 ఎకరాలలోపు వినిపిస్తాయని తెలిపారు..
విస్త్రతంగా అవగాహన సదస్సులు..
సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ పరికరాన్ని రైతుల్లోకి తీసుకెళ్లేందుకు ఖమ్మం జిల్లా వ్యవసాయశాఖ విస్త్రతంగా రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తోంది. బయో ఎకోస్టిక్ పరికరాన్ని ఎలా వినియోగించాలి? ఇది ఎలా పనిచేస్తుంది? రైతులకు ఈ పరికరం వల్ల చేకూరే ప్రయోజనాలు ఏంటి? అనే అంశాలపై రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా రైతులకు రాయితీలపై ఈ పరికరాన్ని అందించనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల వెల్లడించారు.
డిమాండ్‌కు తగ్గట్టుగా లేవు..
అయితే..రైతుల పంటలను కాపాడుకునేందుకు ఉపయుక్తంగా ఉన్న ఈ పరికరానికి డిమాండ్ తగ్గట్టు అందుబాటులో లేవు. ఎక్కువ మొత్తంలో పరికరాలను తెప్పించాలని జిల్లా రైతులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: ఇరు రాష్ట్రాల నీటి కేటాయింపులపై కేంద్రం నివేదిక