దేశంలో తొలిసారి మొబైల్ యాప్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకునే ఈ-ఓటింగ్(E- Voting pilot project)కు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఖమ్మం కార్పొరేషన్‌ను పైలట్ ప్రాజెక్టు(E- Voting pilot project)గా ఎంపిక చేసింది. ఇందులో భాగంగా ఇవాళ సుమారు 4 వేల మంది చరవాణి ద్వారా ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఖమ్మం నగరపాలక సంస్థలో ప్రయోగాత్మకంగా చేపట్టిన డమ్మీ ఈ-ఓటింగ్(E- Voting pilot project) ప్రక్రియ బుధవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ప్రత్యేక యాప్ ద్వారా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఈ-ఓటింగ్ లో పాల్గొనే అవకాశం కల్పించారు.
ఎలా వేయాలంటే..
యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి గుర్తింపుతో ఓపెన్ అవుతుంది. అనంతరం డమ్మీ బ్యాలెట్ కనిపిస్తుంది. ఇందులో ఆల్ఫా, బీటా, గామాల రూపంలో గుర్తులు కనిపిస్తాయి. చరవాణిలో ఓటు వేసిన తర్వాత 10 సెకన్ల పాటు ఎవరికి వేశారో కనిపించేలా ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఓటుహక్కు వినియోగించుకున్న తర్వాత చరవాణికి సంక్షిప్త సందేశం కూడా వస్తుంది. ఈ-ఓటింగ్ మొబైల్ యాప్ లో మంగళవారం వరకు ఎన్నికల సంఘం కొన్ని మార్పులు చేర్పులు చేసింది. బుధవారం మాక్ ఓటు వేసేవారు తప్పనిసరిగా యాప్ అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
అనుకున్న స్థాయిలో జరగని రిజిస్ట్రేషన్లు..
ఇంటి నుంచే ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు పైలట్ ప్రాజెక్టుకు ఖమ్మం కార్పొరేషన్ ను ఎన్నికల సంఘం ఎంపిక చేసింది. ఈ నెల 8వ తేదీ నుంచి ఓటర్లుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. మొత్తం 10 వేల రిజిస్ట్రేషన్లు జరిగేలా ప్రణాళికలు చేసినా.... నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. మొబైల్ నంబరుకు ఆధార్ అనుసంధానం లేకపోవడం, ఓటీపీలు రావడంలో జాప్యం, అవగాహన లేకపోవడంతో పాటు సాంకేతిక సమస్యలు, దసరా పండగ సెలవుల కారణంగా రిజిస్ట్రేషన్లు అనుకున్న స్థాయిలో జరగలేదు.
కేవలం డమ్మీ ఓటింగ్ ప్రక్రియ కావడంతో ఈ-ఓటింగ్ ఎలా జరుగుతుందన్నది పర్యవేక్షించేందుకు ప్రస్తుతం నమోదైన 4000 రిజిస్ట్రేషన్లు సరిపోతాయని ఎన్నికల సంఘం భావిస్తుంది. ఈ-ఓటింగ్ లో జరిగే విధానం, తలెత్తే సమస్యలను ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి అధికారులు పర్యవేక్షించనున్నారు.
ఇదీ చూడండి: