ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు కొత్త పత్తి రాక మొదలైంది. వారం రోజులుగా క్రమంగా పత్తి బస్తాల రాక పెరుగుతోంది. సోమవారం 10 వేల బస్తాల వరకు పత్తి రాగా... మంగళవారం దాదాపు ఆరు వేల బస్తాల వరకు పత్తి మార్కెట్‌కు వచ్చింది. అయితే.. పత్తి రాకతో క్రయవిక్రయాలతో మార్కెట్ కళకళలాడుతుండగా... చెమటోడ్చి పండించిన సాగుదారు ముఖంలో మాత్రం నిర్వేదమే కనిపిస్తోంది. పత్తి ధర పలకక రైతు ఆవేదన చెందుతున్నాడు. ఈఏడు మంచి దిగుబడి వస్తుందని రైతన్న ఆశలు పెట్టుకున్నాడు. కానీ సీజన్ చివర్లో కాలం కక్షగట్టింది. ప్రకృతి కన్నెర్రతో సాగుదారులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాలతో పత్తి పంటకు అపార నష్టం వాటిల్లింది. దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. ఎకరం పత్తి సాగులో 8 నుంచి 10 క్వింటాల వరకు వస్తుందని ఆశించగా... 4 క్వింటాళ్లకు మించలేదు. చేతికొచ్చిన చేసేదేమీలేక చేతికొచ్చిన పత్తితో మార్కెట్‌కు పయనమైన రైతులకు అక్కడా పరాభవమే ఎదురవుతోంది.
ఖర్చులూ రావడం లేదు..
వర్షాలతో దెబ్బతిన్న పత్తి పంటకు క్వింటాకు రూ.4 వేలు కూడా దక్కడంలేదు. సరుకు బాగా ఉంటేనే 4 వేల ధర పలుకుతుంది. మిగిలిన వారంతా రూ.2 వేల నుంచి రూ.3,200 మధ్యే అమ్ముకుంటున్నారు. తేమ శాతం ఎక్కువ ఉందని, నాణ్యత లేదన్న సాకుతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా పత్తి ధరలు నిర్ణయిస్తున్నారు. పెట్టుబడుల మాట పక్కనపెడితే కూలీలు, రవాణా ఖర్చులూ దక్కడం లేదని రైతులు బోరుమంటున్నారు.
సీసీఐ కేంద్రాలపై స్పష్టత కరవు..
సీసీఐ కేంద్రాల్లో కనీస మద్దతు ధర లభిస్తుందని ఆశపడ్డప్పటికీ అవి ఇంకా మొదలు కాలేదు. దసరా నాటికి కేంద్రాలు ప్రారంభించాలని అధికారులు నిర్దేశించినా సీసీఐ కేంద్రాల ఏర్పాటుపై స్పష్టత లేదు.
ఇవీచూడండి: వరదల నేపథ్యంలో ముమ్మరంగా సహాయక చర్యలు