Flood to Irrigation projects: గోదావరి మహోగ్రరూపం దాల్చింది. గత రికార్డులను తిరగరాస్తూ కొత్త గరిష్ఠాలకు వరదపోటుకు చేరుకుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టుకు 4లక్షల18వేల 510 క్యూసెక్కులు వరద వస్తుండగా... 36 గేట్లు ఎత్తిన అధికారులు... 4లక్షల16వేల 934 క్యూసెక్కుల నీటికి దిగువకు వదులుతున్నారు. శ్రీరాంసాగర్ ప్రస్తుత నీటిమట్టం 1087.40 అడుగులకు చేరింది. ప్రస్తుత నీటినిల్వ 74.506 టీఎంసీలుగా ఉంది. ప్రమాద ఘంటికలు మోగించిన నిర్మల్ జిల్లాలోని కడెం జలాశయానికి... వరద ఉద్ధృతి తగ్గింది. సామర్థ్యానికి మించి ప్రవాహం రావడంతో ప్రాజెక్టు భద్రతపై నీలినీడలు కమ్ముకోగా... ప్రస్తుతం వరద తగ్గడం వల్ల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం రాత్రి వరకూ జలాశయంలోకి 5 లక్షల క్యూసెక్కుల వరద నీరురాగా.. ఇవాళ 2 లక్షల క్యూసెక్కులకు పరిమతమైంది. 17 గేట్ల ద్వారా 1లక్షా 83వేల 615 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు.
గోదావరికి మహోగ్రరూపంతో రికార్డు స్థాయిలో వరద నమోదవుతున్నట్లు కేంద్ర జల సంఘం ప్రకటించింది. 1995 అక్టోబర్ 10న సముద్రమట్టానికి 14.3 మీటర్ల ఎత్తులో గోదావరి నీటిమట్టం వచ్చిందని... తాజాగా 14.8మీటర్ల ఎత్తు నుంచి గోదావరి నీరు ప్రవహించిందని పేర్కొంది. ఈమేరకు మంచిర్యాల సైట్ నెంబర్ 44 కార్యాలయ అధికారులు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద భారీ వరద నమోదైతున్నట్లుగా కేంద్ర జలసంఘం ప్రకటించింది. గోదావరి నీటిమట్టం... 107.56 మీటర్లకు చేరింది. మేడిగడ్డ బ్యారేజీకి.. 22 లక్షల 15వేల 760 క్యూసెక్కుల వరద వస్తుండగా... అన్ని గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లను తాకుతూ గోదావరి ప్రవహిస్తోంది. అన్నారం బ్యారేజీకి 14లక్షల 78 క్యూసెక్కుల వరద వస్తుంటే... అంతే నీటిని వదిలేస్తున్నారు. మహాదేవపూర్, కాళేశ్వరం ప్రాంతాల్లో... రెడ్ అలెర్ట్ జారీ చేశారు. దేవాదుల ఇంటేక్ వెల్ వద్ద 91.30 మీటర్లను వరద ప్రవాహాన్ని దాటింది. సమ్మక్కసాగర్ 23 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా...59 గేట్లు ఎత్తి అంతేస్ధాయిలో వరదను దిగువకు వదలిపెడుతున్నారు.
ఇవీ చదవండి: