కరోనా మహమ్మారిని కట్టడి చేయాలి.. వ్యాపారం సజావుగా సాగాలంటే.. ఎలా అని ఆలోచించిన ఆ వ్యాపారి వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టాడు. వ్యాపారం నడిపించుకుంటూనే కరోనా సోకకుండా ఉండేందుకు కాస్తా భిన్నంగా ఆలోచించాడు.
అంతటా ద్రావకం స్ప్రే..
కరీంనగర్ జిల్లా గుండ్లపల్లి క్రాస్ రోడ్డులోని ఓ సూపర్ మార్కెట్ యజమాని కొండ రవీందర్ కరెన్సీని శానిటైజ్ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ పరికరాన్ని కొనుగోలు చేసి దీని ద్వారా కరెన్సీపై, సూపర్ మార్కెట్లోని వస్తువులపై ద్రావకం స్ప్రే చేస్తున్నారు. కరెన్సీ నోట్లకు కూడా వైరస్ అంటుకునే ప్రమాదం ఉండడం, ఆ నోట్లను తీసుకున్న వారికి కూడా వ్యాధి సోకే అవకాశముందని భావించి ఈ మిషన్‌ను కొనుగోలు చేశారు.
నగదును బకెట్లో..
సూపర్ మార్కెట్‌కు వచ్చే వినియోగదారులు ఇచ్చే నగదును ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓ బకెట్లో వేయమని చెప్తున్నారు. అందులో కూడా శానిటైజర్ లిక్విడ్ పోసి ఉంచుతున్నారు. ఆ తరువాత వైపర్ ద్వారా స్ప్రే చేసి నోట్లను గాలికి ఎండబెతున్నారు. పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ పద్ధతిలో కరెన్సీ తీసుకోవడం లేదు కదా! మీరెందుకు ఈ చర్యకు పూనుకున్నారని రవీందర్‌ను ప్రశ్నిస్తే.. 'వ్యాధి.. యజమానిగా నాకు రాకూడదు, ఇక్కడకు వచ్చే వినియోగదారులకు రాకూడదన్న సంకల్పంతోనే ఈ నిర్ణయం తీసుకున్నా' అని చెప్తున్నారు.
ఇవీ చూడండి: ఏపీ రాజ్‌భవన్‌లో 15 మంది భద్రతా సిబ్బందికి కరోనా