మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం(నరేగా) కింద అన్ని గ్రామాల్లో వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డుల నిర్మాణం పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 'పల్లె ప్రగతి'(30 రోజుల ప్రణాళిక) అమలులో ఉత్తమంగా నిలిచిన గ్రామాలకు ఉపాధి హామీ పనుల మంజూరులో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. కొత్త గ్రామపంచాయతీలకు దశలవారీగా జీపీ భవనాలను నిర్మించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
ఉపాధి హామీ పథకం అమలుపై గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ ఉన్నతాధికారులతో మంత్రి దయాకర్ రావు హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. 2019-20 సంవత్సరానికి కేంద్రం రాష్ట్రంలో 12 కోట్ల పని దినాలకు ఆమోదం తెలిపింది. వేతనాల అంచనా ఖర్చు రూ.1800 కోట్లు ఉంటుందన్నారు. ఇప్పటికి 9.77 కోట్ల పని దినాలు పూర్తయ్యాయి. 38.80 లక్షల మందికి ఉపాధి కల్పించడం జరిగింది. ఈ ఏడాది మెటీరియల్ కాంపౌండ్ కింద రూ.1200 కోట్లకు ఆమోదం ఉంది. ఇ
ప్పటి వరకు జరిగిన పనులతో పాటు, హరితహారం చెల్లింపులు పోగా మిగిలిన నిధులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, సీసీ రోడ్ల నిర్మాణానికి అవసరమైన పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. జనవరిలోపు అన్ని పనులకు మంజూరు ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. అవసరమైన చోట కొత్త పనులు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (ఆర్.జీ.ఎస్.ఏ) కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో గ్రామపంచాయతీలకు భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. ప్రతిపాదనలలో కొత్త గ్రామపంచాయతీలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. భూమి లభ్యత ఉన్న వాటికే మంజూరు ఇవ్వాలని స్పష్టం చేశారు. పల్లె ప్రగతిలో పనితీరు బాగా ఉన్న గ్రామపంచాయతీలకే ఆర్. జీ.ఎస్.ఏ భవనాల మంజూరులో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.