ఓ వైపు కొవిడ్ వైరస్‌తో పోరాడుతుంటే.. తమ ప్రాంతంలో నగరపాలక సంస్థ కాలుష్యాన్ని పెంచుతోందంటూ కరీంనగర్ నగర వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న సమస్యలతోనే తట్టుకోలేక పోతుంటే.. డంప్ యార్డ్ కారణంగా ఉత్పన్నమవుతోన్న పొగతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు.
పాలక సంస్థ పరిధిలోని పలు ప్రాంతాల నుంచి చెత్తను సేకరించి నగరంలోని డంప్ యార్డ్‌లో సమకూర్చారు. చెత్త భారీగా పేరుకుపోవడంతో.. పారిశుద్ధ్య కార్మికులు ఆ కుప్పకు నిప్పంటించారు. ఒక్కసారిగా మంటలు చెలరేగి పొగలు వ్యాపించడంతో.. ఆటోనగర్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, లక్ష్మీ నగర్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి.. కాలుష్యం నుంచి కాపాడాలని వేడుకున్నారు.
ఇదీ చదవండి: ఏపీ నుంచి వచ్చే కొవిడ్ రోగులను అనుమతించని పోలీసులు