ప్రచారహోరుతో హుజూరాబాద్(Huzurabad by election 2021)లో అసలైన సందడి కనిపిస్తోంది. విమర్శలు, ప్రతివిమర్శలతో పార్టీలన్ని ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో ఏమి చేసైనా సరే ఓటర్ల మనసుల్ని గెలువాలనే తాపత్రయాన్ని పోటీదారులు చూపిస్తున్నారు. ఇదే అదనుగా ఇలాంటి ప్రతిష్ఠాత్మక ఉప ఎన్నిక పోరు(Huzurabad by election 2021)లో నాయకుల ఆశలను సొమ్ము చేసుకునేందుకు పలువురు చోటామోటా నాయకులు తెరమీదకొస్తున్నారు. ఫలాన వర్గం ఓట్లన్ని గంపగుత్తగా కుమ్మరిస్తామనేలా బేరసారాల్ని సాగిస్తున్నారు. ఊళ్లల్లోనూ ఆయా పట్టణాల్లోని వాడల్లోనూ ఇలా పుట్టుకొస్తున్న కొందరు నాయకులు ఈ ఎన్నికల ధనప్రవాహపు జోరును అదునుగా మార్చుకుంటున్నారు.
చక్రం తిప్పుతామనేలా...
ఉన్న పలుకుబడి ఎంతో తెలియదు కానీ.. ఓటర్లందరినీ తమవైపునకే మలుపుతామనేలా కొందరు హడావుడి చేస్తున్నారు. ఇలా మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు పలువురు స్వతంత్రుల వద్ద తమ చతురతను కొందరు చేతల్లో చూపిస్తున్నారు. చక్రం తిప్పుతామనేలా పలువురు హల్‌చల్ చేస్తున్నారు. చోటామోట సభలు, సమావేశాలతో ఇదిగో మా బలం అని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు.
వీరంతా మా సామాజిక వర్గం. ‘మేం ఎంత చెబితే అంత’ అంటూ రాజకీయ పార్టీల వద్ద రాయ‘బేరాలు’ సాగించే పనిలో పడ్డారు. ఇక్కడ కుదరకుంటే అక్కడ.. కుదిరితే అక్కడ ఇక్కడ అనేలా అన్ని పార్టీల గట్టు మనవనేలా కొందరు వ్యహరిస్తున్నారు. ఇక కాస్తో కూస్తో పలు కాలనీల్లో పలుకుబడి ఉన్న కొందరిలాంటి ఎత్తుగడలతో ఎంతోకొంత వసూలు చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.
కొన్నాళ్ల కిందటి వరకు ఏమి చేయకుండా బలాదూర్‌గా తిరిగిన వారంతా ఇప్పుడు తాత్కాలిక నాయకులుగానే మారిపోతున్నారు. తమదంతా ఒక్కటే అనేలా కొంతమంది సమూహంతో ఐక్యతా రాగాల్ని వినిపిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో అన్ని ఓట్లు వేయిస్తామనేలా ఆశల్ని పుట్టిస్తూ అందిన కాడికి కొంత మొత్తాన్ని పార్టీల నుంచి తీసుకుంటున్నారు. అందరికీ ఇస్తామనేలా వారి జేబుల్ని నింపుకొంటున్నారు.
ఓటరు జాబితాలో ఇంటి పేర్ల ఆధారంగా కొంతమంది పేర్లను వేరు చేయడం, ఇంతమందిమి ఉన్నామనేలా.. లేదా పార్టీలో చేరుతున్నామనేలా కండువాలను కప్పుకొని కొందరు తమ పలుకుబడిని చూపించుకునే ప్రయత్నాల్ని చేస్తున్నారు. కొత్త ఆలోచనలతో ఆయా పార్టీల అవసరాన్ని ఆసరాగా మలుచుకుంటున్నారు. హంగు ఆర్భాటం చేస్తూ తమ సత్తాను చూపిస్తామనేలా ప్రచారాల్లో సందడి చేస్తున్నారు.
ప్రచారంలో సప‘రేటు’..!
బలాన్ని చూపించాలనే ధ్యాసలో ఆయా పార్టీలు కూడా తప్పనిసరైన పరిస్థితుల్లో ఎంతైనా సరే కానిచ్చేద్దామనేలా అడుగులేస్తున్నారు. ముఖ్యంగా ప్రచారం(Huzurabad by election campaign 2021)లో సందడి కనిపించాలంటే జనసమీకరణ కీలకమవడంతో ఇందుకోసం తప్పని సరిగా సప‘రేటు’ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. చుట్టూ మంది మార్బలం.. పార్టీ జెండాలతో ప్రచారాల్ని సాగించేందుకు వెంట వచ్చిన వారికి ఎంతో కొంత ముట్టజెప్పాల్సిన పరిస్థితి ప్రచారాల్లో నెలకొంటోంది. ఈ రోజు ఈ పార్టీలో జెండా కనిపిస్తున్న వ్యక్తి మరుసటి రోజు మరోపార్టీ టోపీ కండువాతో కనిపిస్తుండటం విశేషం. ఇక ప్రచారానికి వస్తున్న వారికి తప్పదన్నట్లు రూ.300 నుంచి రూ.500 వరకు వెచ్చిస్తున్నారు.ఉదయం పూటనే వస్తే ఒక రేటు.. రోజంతా ప్రచారంలో ఉంటే మరొక రేటు అనేలా ఇక్కడి ప్రచార పరిస్థితి కనిపిస్తోంది. పెద్ద నాయకులొచ్చినప్పుడు మాత్రం జనాల తరలింపునకు చోటామోట నాయకులు వంద నుంచి రెండు వందల మందిని తెప్పించేలా ఒప్పందాల్ని చేసుకుంటున్నారు. పనిలోపనిగా వాళ్లతో ఎంత మాట్లాడుకున్నామనేది పార్టీల వాళ్లకు తెలియకుండా వచ్చిన వారికి మాత్రం బేరామాడి ఎంతో కొంత నగదును చేతిలో పెడుతున్నారు.