మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే తెరాసకు గుడ్‌బై చెప్పిన ఆయన తాజాగా శాసనసభ సభ్యత్వానికీ రాజీనామా చేశారు. శామీర్‌పేటలోని తన ఇంటి నుంచి అనుచరులతో గన్‌పార్క్ చేరుకొన్న ఆయన ఏనుగు రవీందర్‌రెడ్డి, తుల ఉమతో కలిసి.. అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. అనంతరం శాసనసభాపతి కార్యాలయంలో ఈటల రాజీనామా పత్రాన్ని అందజేశారు. 17 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగినా..తనను రాజీనామ చేయమని ప్రజలే ఆశీర్వదించారన్నారు. తెరాస బీ ఫారం ఇచ్చి ఉండొచ్చు. కానీ గెలిపించింది ప్రజలు అని అన్నారు. అధికార దుర్వినియోగం చేసి ఉప ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు
నియంత నుంచి విముక్తి కల్పించడమే నా ఎజెండా..
'' తెలంగాణ రాష్ట్రమే శ్రీరామ రక్ష అని కొట్లాడాం. అనేక మంది ఇతర పార్టీల్లో గెలిచి రాజీనామా చేయకుండా తెరాసలో చేరి నిస్సిగ్గుగా మంత్రులుగా కొనసాగుతున్నారు. హుజూరాబాద్ ఎన్నిక యావత్ తెలంగాణ ప్రజలకు..కేసీఆర్ కుటుంబానికి మధ్య జరగబోతోంది. వడ్లు తడిచి మొలకలు వచ్చినా పట్టించుకోరు. యువతకు ఉపాధి లేకపోయినా స్పందించరు. కానీ నన్ను చక్రబంధంలో పెట్టాలి అని పోలీసు అధికారులను వాడుతున్నారు. నాకు నిర్బంధాలు కొత్తకాదు.. నియంత నుంచి తెలంగాణను విముక్తి కల్పించడమే నా ఎజెండా. అందరూ హుజురాబాద్ ప్రజలకు అండగా ఉండండి. మనిషిగా ప్రతి ఒక్కరినీ ఆదుకుంటా - ఈటల రాజేందర్.