వైతెపా అధికారంలోకి రాగానే పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపుతామని ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. దివంగత రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 3.30 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చారని ఆమె చెప్పారు. తమ పార్టీ ఆదివాసులను గౌరవిస్తుందని.. వారి చేతుల్లో పోడు భూముల పట్టాలు పెడుతుందని హామీ ఇచ్చారు.
హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఆదివాసీ, గిరిజన ప్రతినిధుల ఆత్మీయ సమావేశంలో వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఆదివాసీ, గిరిజన సంఘాల ప్రతినిధులు, విద్యార్థి సంఘాల నేతలు, రచయితలు, ఉద్యోగ సంఘాల నేతలు, ప్రొఫెసర్లు, మేధావులతో.. ఆదివాసీల సమస్యలపై చర్చించారు.
ఆదివాసీలు నివసించే ప్రాంతాల్లో ఇప్పటికీ విద్యుత్, బస్సు సౌకర్యం లేదని.. ఇప్పటికీ చాలా మందికి ఇళ్లు లేవని, షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సమస్యలు చాలా ఎదుర్కొంటున్నా.. వారు బతుకుదెరువు సాగిస్తున్నారంటే అందుకు ప్రధాన కారణం భూములు ఉన్నాయనే భరోసాతోనే అని అన్నారు.
సీఎం కేసీఆర్ గత అసెంబ్లీ సాక్షిగా పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన వీడియోను సమావేశంలో ప్రదర్శించారు. తాము నిరుద్యోగ, పోడు భూముల సమస్యను తీసుకొంటే.. కాంగ్రెస్ సైతం దానిపైనే మాట్లాడుతుందన్నారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధికి లేదని ఆ పార్టీని ఎవరూ నమ్మాల్సిన అవసరం లేదన్నారు.. వైఎస్ షర్మిల.
'అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్ని లక్షల ఎకరాలున్నా పోడు భూములకు పట్టాలిస్తాం. పోడు భూములకు వైఎస్ఆర్ పట్టాలిచ్చినట్లుగానే తాము కూడా ఇస్తాం. తెరాస ప్రభుత్వం పట్టాలిస్తే సంతోషం.. అభినందిస్తాం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పట్టాలిస్తామంటే సమ్మాల్సిన పనిలేదు. వైఎస్ మరణించిన తర్వాత.. ఐదేళ్లు వారు అధికారంలో ఉన్న పట్టాలివ్వలేదు.'
- వైఎస్ షర్మిల, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు.
ఇదీచూడండి: KTR: 'ఎవరూ రాజీనామా చేయాల్సిన పనిలేదు.. అక్కడ కూడా దళితబంధు ఇస్తాం'