YSRCP MLAS: ఏపీలో మంత్రి పదవులు రాని అసంతృప్త ఎమ్మెల్యేలకు బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. పిన్నెల్లితో మాట్లాడాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సీఎం ఆదేశించారు. సచివాలయంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. పెద్దిరెడ్డిని కలిశారు. ఆయన పిన్నెల్లిని బుజ్జగిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జగ్గయ్యపేట ఎమ్మెలే ఉదయభాను సీఎంను కలవనున్నారు.
శాంతించిన బాలినేని: బాలినేని బుజ్జగింపుల పర్వం ముగిసింది. మంత్రివర్గంలో స్థానం దక్కనందుకు నిన్నటి నుంచీ అసంతృప్తితో రగిలిపోయిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎట్టకేలకు శాంతించారు. ఆదివారం నుంచి సోమవారం సాయంత్రం వరకు తన ఆగ్రహాన్ని మౌనంగానే వ్యక్తపరిచిన బాలినేని.. చిట్ట చివరకు దిగివచ్చారు. ముఖ్యమంత్రి ఏం మంత్రం వేశారో గానీ.. ఆయనతో భేటీ అనంతరం పూర్తిగా కూల్ అయిపోయారు. తాను వైఎస్ కుటుంబానికి విధేయుడిని అని ప్రకటించుకున్న మాజీ మంత్రి.. జగన్ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా నిర్వహిస్తానని చెప్పుకొచ్చారు.
మూడుసార్లు కలిసిన సజ్జల : కొత్త మంత్రుల జాబితాలో తన పేరు కొనసాగించకపోవడంతో బాలినేని ఆదివారం నుంచీ అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం కూడా సాగింది. దీంతో విజయవాడలోని బాలినేని నివాసానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, అనిల్, మాధవరావు వెళ్లారు. బాలినేనితో సమావేశమై బుజ్జగించే ప్రయత్నం చేశారు.నిన్న(ఆదివారం) సాయంత్రం కొత్త మంత్రుల పేర్లు బహిర్గతం అయినప్పటి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి బాలినేనితో మూడుసార్లు సమావేశమయ్యారు. నిన్న మధ్యాహ్నం ఒకసారి, రాత్రి శ్రీకాంత్‌రెడ్డితో కలిసి మరోసారి బాలినేనిని కలిసిన సజ్జల.. ఇవాళ(సోమవారం) మూడోసారి బాలినేనితో భేటీ అయ్యారు. అయినప్పటికీ మాజీ మంత్రి మెత్తబడలేదు.
ఈ క్రమంలోనే సీఎం జగన్ స్వయంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. బాలినేనిని తన వద్దకు తీసుకురావాల్సిందిగా సజ్జలను సీఎం ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి కలిసి బాలినేనిని సీఎం వద్దకు తీసుకెళ్లారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసుకు బాలినేని చేరుకున్నారు. మంత్రిపదవి రాకపోవడానికి గల కారణాలను వివరిస్తూ.. భవిష్యత్ హామీలతో బానినేనిని ముఖ్యమంత్రి జగన్ బుజ్జగించారు. దీంతో చల్లబడిన బాలినేని తాను వైఎస్ కుటుంబానికి, వైకాపాకు విధేయుడినని మీడియా ముఖంగా ప్రకటించారు.
"మంత్రి పదవి విషయంలో రాజీనామా చేస్తానన్న వార్తల్లో నిజం లేదు. గతంలో జగన్ కోసం మంత్రి పదవి వదులుకున్నా. మేము వైకాపా, వైఎస్‌ఆర్ కుటుంబం, జగన్‌కు విధేయులం. మంత్రి పదవి అనేది సీఎం ఆలోచన మేరకు ఉంటుంది. మంత్రి పదవి కోసం ఎప్పుడూ అర్రులు చాచే పరిస్థితి లేదు. అందరికీ పదవులు ఒకేసారి రావు. సమయానుకూలంగా పదవులు అవే వస్తాయి. జగన్ ఇచ్చిన పార్టీ బాధ్యతలను నెరవేరుస్తా. గతంలో కంటే ఎక్కువ సీట్లు రావడానికి కృషిచేస్తా. ఆదిమూలపు సురేశ్, నాకు మధ్య ఎలాంటి విభేదాలు లేవు. సురేశ్‌కు మంత్రి పదవి ఇస్తే నేను అలకబూనాననడం అవాస్తవం. ఆదిమూలపు సురేశ్, నేను మంత్రులుగా కలిసి పనిచేశాం. జగన్ నాయకత్వంలో అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. సమర్థత ఉన్న నాయకులనే మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కొత్త మంత్రులు మంచి పేరు తీసుకువస్తారని ఆశిస్తున్నా. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. సీఎం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నా. కొత్త మంత్రివర్గానికి అందరూ మద్దతివ్వాలి" - బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి
ఇప్పటికే తాజా మాజీమంత్రి సుచరిత శాసనసభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. ఆమె వర్గీయులు పలువురు అదే బాటలో పదవులకు రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం సీఎం జగన్‌ను కలిసిన తర్వాత బాలినేని మెత్తబడగా.. సుచరిత విషయంలో మాత్రం పార్టీ ప్రాంతీయ బాధ్యుడైన ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఒక్కరే విఫలయత్నం చేశారు. పాత మంత్రివర్గంలో కీలకశాఖ బాధ్యతలు చూసిన ఓ మాజీమంత్రి రాజీనామా పత్రం సమర్పించిన రోజే విజయవాడలో ఇల్లు ఖాళీ చేసి నేరుగా చెన్నైకి వెళ్లిపోయారు. అక్కడ సీఎం సన్నిహిత బంధువుతో తన ఆవేదన పంచుకున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ‘జగన్‌కు సూయిసైడ్ స్క్వాడ్ వంటి మమ్మల్ని ఎందుకు తొలగించారో అర్థం కావటం లేదని’ ఇద్దరు మాజీలు వ్యాఖ్యానిస్తున్నట్లు సమాచారం. ప్రతిపక్షంపై నిత్యం దారుణమైన విమర్శలతో విరుచుకుపడే ఓ తాజా మాజీ పేరు ఆఖరి నిమిషం వరకు కొనసాగింపు జాబితాలో ఉందని, ఓ సలహాదారు జోక్యంతో తొలగించారనే ప్రచారం పార్టీ వర్గాల్లో నడుస్తోంది. దీన్ని తాజా మాజీ నమ్మనట్లు కనిపిస్తున్నా ఆయన వర్గీయులు మాత్రం ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.
అన్నా రాంబాబు అనుచరుల నిరసన.. ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు అనుచరులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అన్నా రాంబాబుకు మంత్రి పదవి రాలేదనంటూ కంభంలో ఆయన అనుచరుల రాస్తారోకో చేశారు. అలాగే కంభంలో ఆర్యవైశ్యులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి నిరసన చేపట్టారు.
పార్థసారథి నివాసానికి ఎంపీ మోపిదేవి.. విజయవాడలో ఉన్న పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి నివాసానికి ఎంపీ మోపిదేవి వెంకటరమణ వచ్చారు. మంత్రి పదవి రాలేదని అసంతృప్తితో ఉన్న పార్థసారథితో ఆయన చర్చించారు. పార్థసారథికి మంత్రి పదవి రాకపోవడంపై ఆయన అనుచరులు, పెనమలూరు నియోజకవర్గ కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు.
ఇవీ చూడండి: మంత్రం వేసిన జగన్.. కూల్ అయిపోయిన బాలినేని..!
కన్నబిడ్డపై తల్లి కర్కశత్వం.. ఛాతిపై బాది.. నేలకేసి కొట్టి..