ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార వైకాపా విస్పష్ట ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. రాష్ట్రంలోని మొత్తం 11 కార్పొరేషన్లనూ కైవసం చేసుకుంది. రాష్ట్రంలోనే పెద్దదైన విశాఖ కార్పొరేషన్‌లో అధికార వైకాపా పాగా వేసింది. మొత్తం 98 డివిజన్లకు గానూ... వైకాపా 58 స్థానాలు గెలుచుకోగా... తెలుగుదేశం 30 చోట్ల విజయం సాధించింది. జనసేన-భాజపా కూటమి 4 స్థానాల్లో విజయం సాధించింది. సీపీఎం, సీపీఐ అభ్యర్థులు చెరో స్థానం గెలిచారు. ఇతరులు నాలుగు స్థానాల్లో గెలుపొందారు.
గుంటూరు కార్పొరేషన్ అధికార వైకాపా పరమైంది. ఇక్కడ మొత్తం 57 డివిజన్లు ఉండగా... 44 స్థానాల్లో వైకాపా జయకేతనం ఎగరేసింది. తెదేపా 9 స్థానాల్లో గెలుపొందగా... జనసేన, స్వతంత్రులు చెరో రెండు స్థానాల్లో విజయం సాధించారు. విజయవాడ మేయర్ పీఠాన్ని వైకాపా కైవసం చేసుకుంది. కార్పొరేషన్‌లోని మొత్తం 64 డివిజన్లలో వైకాపా 49 వార్డుల్లో విజయఢంకా మోగించింది. ప్రధాన ప్రతిపక్షం కేవలం 14 స్థానాలకు పరిమితం కాగా.. ఒక చోట సీపీఏం గెలుపొందింది.
మచిలీపట్నం కార్పొరేషన్‌లోని 50 స్థానాలకు గానూ... వైకాపా 44 స్థానాలను కైవసం చేసుకుంది. తెలుగుదేశం 5, జనసేన-భాజపా కూటమి ఒక స్థానంలో విజయం సాధించాయి. ఒంగోలు కార్పొరేషన్ వైకాపా వశమైంది. మొత్తం 50 డివిజన్లలో ఒక స్థానం వైకాపాకు ఏకగ్రీవం కాగా... 49 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. వీటిలో వైకాపా 40 స్థానాలు కైవసం చేసుకుని కార్పొరేషన్‌పై జెండా ఎగరవేసింది. తెలుగుదేశం 6, జనసేన ఒక స్థానంలో గెలిచాయి. ఇతరులు రెండు స్థానాల్లో విజయం సాధించారు. ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడపలో వైకాపా జెండా ఎగిరింది. కడప కార్పొరేషన్‌లోని మొత్తం 50 డివిజన్లలో 48 స్థానాల్లో వైకాపా గెలుపొందింది. తెలుగుదేశం, ఇతరులు చెరో స్థానంలో గెలిచారు. ఇక్కడ గతంలోనే 24 స్థానాలు వైకాపాకు ఏకగ్రీవవమయ్యాయి.
చిత్తూరు కార్పొరేషన్ వైకాపా ఖాతాలో చేరింది. మొత్తం 50 డివిజన్లలో వైకాపా 46 స్థానాల్లో గెలుపొంది కార్పొరేషన్‌ను కైవసం చేసుకుంది. తెలుగుదేశం 3 స్థానాలకు పరిమితం కాగా.... స్వతంత్రులు ఒకచోట గెలిచారు. తిరుపతి నగరపాలక సంస్థనూ వైకాపా హస్తగతం చేసుకుంది. మొత్తం 50 డివిజన్లకు గానూ 48 స్థానాల్లో వైకాపా జయభేరి మోగించింది. ఒక స్థానంలో తెలుగుదేశం గెలుపొందింది. ఒక్కచోట ఎన్నిక జరగలేదు. ఇక్కడ గతంలోనే 22 స్థానాలు వైకాపాకు ఏకగ్రీవమయ్యాయి.
కర్నూలు కార్పొరేషన్ వైకాపా ఖాతాలో చేరింది. మొత్తం 52 డివిజన్లలో 41 స్థానాల్లో వైకాపా జెండా ఎగిరింది. తెలుగుదేశం 8, స్వతంత్రులు 3 స్థానాల్లో విజయం సాధించారు. అనంతపురం కార్పొరేషనూ అధికార పక్షం వశమైంది. 50 డివిజన్లు ఉన్న అనంతపురం నగరపాలక సంస్థలో 48 స్థానాలు వైకాపా కైవసం చేసుకోగా... స్వతంత్రులు రెండు చోట్ల గెలుపొందారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి ఒక్క స్థానమూ దక్కలేదు. విజయనగరం కార్పొరేషన్ వైకాపా పరమైంది. మొత్తం 50 డివిజన్లకు గానూ వైకాపా 48స్థానాల్లో గెలుపొందింది. తెలుగుదేశం ఒక స్థానంలో విజయం సాధించింది. స్వతంత్రులు ఒక స్థానంలో గెలుపొందారు.
ఇదీ చదవండి: భారీగా తరలివచ్చిన పట్టభద్రులు... 60 శాతానికి పైగా పోలింగ్!