హైదరాబాద్ పాతబస్తీలోని భవానీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఓ బరాత్‌లో యువకులు హల్చల్ చేశారు. డీజే పాటలకు చేతుల్లో కత్తులు, పెద్దపెద్ద తల్వార్లు పట్టుకుని నృత్యాలు చేసిన యువకుల దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ దృశ్యాలు వైరల్ అవుతూ.. భవానీ నగర్ పోలీసులకు చేరాయి. కత్తులు, తల్వార్లతో ప్రమాదకరంగా నృత్యాలు చేస్తున్న వీడియో చూసిన పోలీసులు విచారణ మొదలుపెట్టారు.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారి..
ఈ నెల 16వ తేదీన నశేమన్నగర్ ప్రాంతంలో ఈ బరాత్ జరిగినట్లు దర్యాప్తులో తెలిసింది. ఎండీ తజముల్ హుస్సేన్ అనే యువకుని ఆధ్వర్యంలో జరిగిన బరాత్‌లో 8 మంది యువకులు పాల్గొన్నారు. పియానో, బ్యాండ్లతో తీసిన ఈ బరాత్‌లో పెద్దపెద్ద తల్వార్లు, కత్తులతో యువకులు నృత్యాలు చేశారు. ఈ డ్యాన్సులను కొంత మంది ఆసక్తిగా వీక్షించగా... మరి కొంత మంది యువకులు ఈ తతంగాన్ని చరవాణుల్లో బంధించారు. అక్కడితో ఆగకుండా.. ఈ ఘనకార్యాన్ని అత్యుత్సాహంతో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అవి కాస్తా వైరల్‌గా మారి.. నేరుగా వెళ్లి పోలీసుల చేతికి చిక్కాయి.
మారణాయుధాలతో ఆటలు శిక్షార్హం..
మారణాయుధాలతో బహిరంగంగా ఇలాంటి నృత్యాలతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటమే కాకుండా... వీటిని చూసి ప్రభావితమై మిగతా వాళ్లు కూడా పాటించే అవకాశాలు ఉన్నాయని పోలీసులు కేసు నమోదు చేశారు. వీడియోలో ఉన్న యువకులు ఎవరు..? వారికి ఈ తల్వార్లు, కత్తులు ఎక్కడివి..? బరాత్ దేని గురించి తీశారు...? అన్న అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదాలకు అవకాశమున్న ఏ చర్యలైనా శిక్షార్హమేనని పోలీసులు హెచ్చరించారు. శాంతికి విఘాతం కలిగించేలా బహిరంగా ప్రదేశాల్లో మారణాయుధాల ప్రదర్శన నిషేధితమని స్పష్టం చేశారు.