Yanamala: ఉద్యోగులను వాడుకుని వదిలేయడంలో ఏపీ సీఎం జగన్ రెడ్డిది అగ్రస్థానమని శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. ప్రతిపక్షాల అక్రమ అరెస్టులకు గౌతమ్ సవాంగ్‌ను అడ్డగోలుగా వాడుకుని, ఇప్పుడు అవమానకర రీతిలో గెంటేశారని ఆరోపించారు. అవసరం తీరే వరకూ అన్న, అవసరం తీరాక దున్న అన్నట్లు జగన్ వైఖరి ఉందని ఎద్దేవా చేశారు.
ఎల్వీ సుబ్రహ్మణ్యంను అన్నా అంటూనే గెంటేశారని.. పీవీ రమేష్, అజేయకల్లాం రెడ్డిలను పొమ్మనకుండా పొగబెట్టారని గుర్తు చేశారు. చీకటి జీవోల ఆద్యుడు ప్రవీణ్ ప్రకాశ్‌ను ఆకస్మికంగా దిల్లీ తరిమేశారని యనమల విమర్శించారు. ఉద్యోగులు, పోలీసుల పట్ల జగన్ వ్యవహారం దుర్మార్గంగా ఉందని ఆరోపించారు. సీఎం వ్యవహారశైలిని, నైజాన్ని ఉద్యోగులు, పోలీసులు అర్ధం చేసుకోవాలని కోరారు. ఆస్తులు తాకట్టు పెట్టి, భూములు అమ్మి భారీగా ఆదాయం వస్తుంటే, ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇవ్వలేని స్థితిలో రాష్ట్రం ఉందన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం మోసమని మండిపడ్డారు. జగన్ రెడ్డి దుబారా, లూటీతో రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిందన్నారు. రాష్ట్రంలో ఆర్ధిక సంక్షోభాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 360 ప్రకారం ఆర్ధిక ఎమర్జెన్సీ విధించాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: KTR Comments on Modi : 'మోదీకి మరో అవకాశమిస్తే.. తెలంగాణ-ఆంధ్రాను కలిపేస్తారు'