Millet Products : రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా పలు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీవో), మహిళా స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ) ఈ ధాన్యాలను రైతుల నుంచి నేరుగా కొని, శుద్ధి చేసి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసి ఆదాయం పొందుతున్నాయి. ఫలితంగా ఆయా పంటల మార్కెటింగ్, సాగు విస్తీర్ణంతో పాటు రైతుల ఆదాయం కూడా పెరుగుతోంది. సాగుకు వివిధ రకాల వంగడాలను ఇవ్వడం మొదలు... పంట పండిన తరవాత తిరిగి కొంటామనే ఒప్పందం కూడా ఈ సంఘాలు రాసి ఇస్తుండడంతో రైతులకు భరోసా కలుగుతోంది. తెలంగాణలో వ్యవసాయశాఖ ప్రోత్సాహంతో ప్రస్తుత వానాకాలం సీజన్‌లో ఇప్పటికే 12,500 ఎకరాల్లో తృణధాన్యాలు సాగు చేశారు. ఇంకా పెరిగే సూచనలున్నాయి.
సంఘాలే కీలకం.. తృణధాన్యాల్లో జొన్నలు, సజ్జలు, రాగులకు తప్ప మిగతా పంటలకు మద్దతు ధర లేకపోవడంతో వీటికి మార్కెటింగ్ అవకాశాలను పెంచడంలో ఎఫ్‌పీవోలు, ఎస్‌హెచ్‌జీలు కీలకంగా మారుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 4,30,612 మహిళా సంఘాలు, 300కి పైగా ఎఫ్‌పీవోలున్నాయి. రాష్ట్రంలో పలు మహిళా సంఘాలు ఇప్పటికే రాగి లడ్డు, మల్టీగ్రెయిన్ లడ్డూలు, మురుకులు, జొన్నరొట్టె తదితర 45 రకాల ఉత్పత్తులను తయారు చేసి ప్రత్యేక బ్రాండు పేర్లతో విక్రయిస్తున్నాయి.
cereal products : మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్, రాయికల్, ఝరాసంగం, న్యాలకల్, వరంగల్ జిల్లా పర్వతగిరి తదితర మండలాల్లో మహిళా సంఘాలు తృణధాన్యాల శుద్ధి, ఉత్పత్తుల తయారీ ప్లాంట్లు పెట్టాయి. కేంద్రం అమలు చేస్తున్న ‘రూర్బన్’ పథకం కింద మహిళా సంఘాలకు ప్రోత్సాహాకాలిచ్చి ఈ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. మహిళలతో ‘రైతు ఉత్పత్తిదారుల సంఘాలు’ ఏర్పాటు చేయించి ఈ ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్‌ను నాబార్డు, కేంద్రం ప్రోత్సహిస్తున్నాయి.
వచ్చే రెండేళ్లలోగా దేశంలో 10 వేల ఎఫ్‌పీవోలు ఏర్పాటు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టింది. పంటల నుంచి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీతో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని సూచించింది. తెలంగాణలో గత ఏడాది 16, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 25 ఎఫ్‌పీవోలు ఏర్పాటు చేయాలని కేంద్రం లక్ష్యం విధించింది. ఇవి సొంత బ్రాండుతో తృణధాన్య ఉత్పత్తుల శుద్ధి, తయారీ ప్లాంట్లు లేదా మార్కెటింగ్ వ్యాపారం పెట్టుకున్నా ‘ఆత్మనిర్భర్ భారత్’ పథకం కింద రూ.2 కోట్ల వరకు బ్యాంకుల ద్వారా రుణాలిస్తారు. మహిళా సంఘాలు కూడా ఎఫ్‌పీవో పేరుతో కంపెనీ చట్టం కింద నమోదు కావడానికి అవకాశాలు కల్పిస్తున్నారు.
ఐఐఎంఆర్‌లో అధునాతన పరిజ్ఞానం.. భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్)లో అంతర్భాగమైన భారత తృణధాన్యాల పరిశోధన సంస్థ (ఐఐఎంఆర్) హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్‌లో ఉంది. తృణధాన్యాల నుంచి సులభంగా ఆహారోత్పత్తుల తయారీకి అవసరమైన అధునాతన యంత్రాలను ఈ సంస్థ అందిస్తోంది. దీంతో ఒప్పందం చేసుకుని ప్రైవేటు కంపెనీలు ఈ యంత్రాలను తయారుచేసి దేశమంతటా విక్రయిస్తున్నాయి. వీటితో తయారు చేసే ఉత్పత్తులతో కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో ప్రత్యేక హోటళ్లను సైతం ఏర్పాటు చేస్తున్నారని సంస్థ ప్రధాన శాస్త్రవేత్త దయాకరరావు చెప్పారు.
కొత్తగా ఈ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ముందుకొచ్చే సంస్థలను సైతం ఎఫ్‌పీవోల నుంచి కొనేలా ఐఐఎంఆర్ ప్రోత్సహిస్తోందని దయాకరరావు అన్నారు. తృణధాన్య ఉత్పత్తులను తినడం మొదలుపెడితే ఇక వరి అన్నం జోలికి పోలేనంత రుచి, పోషకాలు అందుకోవచ్చని ఆయన ప్రజలకు సూచించారు. ఈ ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్‌కు ఎఫ్‌పీవోలు, మహిళా సంఘాలు, అంకుర సంస్థలను ఐఐఎంఆర్ ప్రోత్సహిస్తోంది. తగిన శిక్షణ కూడా ఇప్పిస్తోంది. రుణాలు కావాలన్నా ఎఫ్‌పీవో ద్వారా పొందవచ్చని నాబార్డు తెలంగాణ రాష్ట్ర చీఫ్ జనరల్ మేనేజర్ వై.కృష్ణారావు ‘ఈనాడు’కు చెప్పారు.
లాభాలు మెండు.. మహబూబ్‌నగర్‌లో ఒక మహిళా సంఘం రైతుల నుంచి కొర్రలను క్వింటాకు రూ.3000 - 3500 వరకు చెల్లించి బైబ్యాక్ ఒప్పందాలతో కొంటోంది. వీటి నుంచి 75 కిలోల దాకా శుద్ధి చేసిన పంట రాగా వాటిని కిలో రూ.100కి అమ్ముతూ రూ.7500 దాకా ఆర్జిస్తోంది.
ఎగుమతీ చేస్తున్నారు.. కొన్ని సంఘాలు యంత్రంపై జొన్న రొట్టెలను తయారుచేసి పదేసి చొప్పున ప్యాక్ చేస్తున్నాయి. ఒక్కో ప్యాకెట్ టోకుగా రూ.50కి, చిల్లరగా రూ.100కి అమ్ముతున్నారు. కిలో జొన్నలకు రైతుకు రూ.30-35 చెల్లిస్తున్నారు. కిలో జొన్నలతో 30 దాకా రొట్టెలు వస్తున్నాయి. టోకుగా అమ్మినా కిలో జొన్నల నుంచి ఉత్పత్తి చేసే 30 రొట్టెలకు కనిష్ఠంగా రూ.150, గరిష్ఠంగా రూ.300 వరకు ఆదాయం వస్తోంది. ఈ రొట్టెలు ఆరు నెలల వరకు నిల్వ ఉంటున్నందున ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు.