అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న భారతీయ నారీమణులు ప్రతిష్ఠాత్మక పురస్కారాలనూ అందుకున్నారు. దేశం గర్వించే స్థాయికి ఎదుగుతున్నారు. అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
గునీత్ మోంగా..
ఇరువైపులా పదునున్న కత్తిలాంటి భావాలున్న వ్యక్తిగా సినీరంగంలో గునీత్ మోంగాకు పేరుంది. ఈమె నిర్మించిన రెండు చిత్రాలకుగాను, తాజాగా ఫ్రెంచి ప్రభుత్వం నుంచి ప్రత్యేక గౌరవాన్ని అందుకున్నారు. తన చిత్రాల్లో సామాజిక అంశాలతోపాటు మహిళా సమస్యలకు ఈమె ప్రాధాన్యమిస్తారు. మూఢాచారాలను తెరకెక్కించి అందరినీ ఆలోచించేలా చేయడమే తన లక్ష్యం అంటారీమె. ‘మా అమ్మ క్యాన్సర్‌కు బలైంది. ఆరోగ్యపరంగా ఆమె ఎదుర్కొన్న సమస్యలను చూస్తూ పెరిగా. నెలసరిపై ఉన్న అపోహలనూ చాలా మందిలో చూశా. వీటిపై అవగాహన తేవాలన్నదే నా ఆలోచన. అలా నిర్మించిందే ‘పిరియడ్... ఎండ్ ఆఫ్ సెంటెన్స్’ చిత్రం. ఇది ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది. నేను నిర్మించిన మరో చిత్రం ‘మాసాన్’తో సమాజంలో మార్పు పూర్తిగా రాకపోవచ్చు. అయితే ఈ అంశాలపై చర్చ మొదలవ్వాలన్నదే నా అభిమతం. నా చిత్రాలు ‘లంచ్‌బాక్స్’, ‘మాన్‌సూన్ షూట్‌అవుట్’ ఇంటర్నేషనల్ క్రిటిక్స్ వీక్‌కు ఎంపికయ్యాయి. వీటిని ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ ప్రదర్శించారు. లంచ్‌బాక్సు సినిమాకు బాఫ్టా అవార్డు వచ్చింది. ఈ రెండు చిత్రాలూ తాజాగా ఫ్రెంచ్ ప్రభుత్వం నుంచి ‘నిట్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్’ పేరుతో సెకండ్ హయ్యస్ట్ సివిలియన్ ఫ్రెంచ్‌గా పురస్కారాన్ని ఇప్పించాయి’ అంటోన్న గునీత్ మోంగా దిల్లీలో మాస్ కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ చదివారు. 20 ఏళ్లక్రితం వెట్టిచాకిరి ప్రధానాంశంగా చేసి తొలిసారిగా నిర్మించిన ‘కవి’ లఘుచిత్రంతో మొదలైన ఈమె ప్రస్థానంలో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలెన్నో అందుకున్నారు. ప్రొడ[క్షన్ సంస్థను స్థాపించి, దాదాపు పాతిక సినిమాలను నిర్మించారు. గునీత్ స్వచ్ఛంద సేవలోనూ ముందుంటారు. కొవిడ్ సమయంలో వేల మంది ఆకలి తీర్చడానికి విరాళాలను సేకరించి జుహూలోని కమ్యూనిటీ కిచెన్‌కు చేయూతనందించారు. ‘తమదైన లక్ష్యంతో ముందడుగేసే అమ్మాయిలందరికీ ఈ గౌరవాన్ని అంకితమిస్తున్నా’ అంటున్నారావిడ.
భారతీ హరిశంకర్
దేవదాసీ దురాచారంపై ఎన్నో అధ్యయనాలు చేశారు ప్రొఫెసర్ భారతీ హరిశంకర్. సమస్యలనే కాకుండా వాటికి పరిష్కారాలనూ సూచిస్తూ తన పరిశోధనా పత్రాలను ‘నేషనల్ కమిషన్ ఫర్ విమెన్’ తదితర ప్రతిష్ఠాత్మక సంస్థలకు సమర్పించారు. సామాజికంగా, ఆర్థికంగా దేవదాసీల అభ్యున్నతి కోసం విస్తృత సూచనలనూ అందించారు భారతి. విద్యా రంగంలో ప్రత్యేక స్థానాన్ని పొందిన ఈమె తాజాగా ‘ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్’కు ఎంపికయ్యారు. సామాజిక మార్పు కోసం ఈమె చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ గౌరవాన్ని అందుకున్నారు. హైదరాబాద్ విశ్వ విద్యాలయంలో ఆంగ్లంలో పీహెచ్‌డీ చేసిన ఈమె, జెండర్ స్టడీస్, పోస్ట్ కొలోనియల్ లిటరేచర్ వంటి అంశాలపై పరిశోధన చేశారు. అధ్యయనాలు, పరిశోధనలతోపాటు సాహిత్యం, అనువాదాలు, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ పాఠ్య పుస్తకాలు సహా 100కు పైగా ప్రొ.భారతి రచనలు ప్రచురితమయ్యాయి. పరిశోధకురాలిగా తాను చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లు మనసుకు తృప్తినిస్తాయి అంటారీమె. ‘మద్రాసు ఐఐటీలో ‘ఆన్‌లైన్ ట్యుటోరియల్ ఫర్ స్కూల్ స్టూడెంట్స్’ ప్రాజెక్టుకు ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా పనిచేశా. దేవదాసిలను అందులోంచి బయటకు తేవడానికి మార్గాలున్నాయి. ఎన్జీవోలద్వారా వారికి విద్యపై అవగాహన కలిగించాలి. సంప్రదాయ కళలపై శిక్షణనిప్పించాలి. వీటి ద్వారా స్వయం ఉపాధిని అందించొచ్చు’ అని చెబుతారీమె. ప్రస్తుతం మద్రాసు విశ్వ విద్యాలయంలో విమెన్ స్టడీస్ విభాగాధిపతిగా, ఐక్యూఏసీ డైరెక్టర్‌గా ఉన్న భారతి ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్, మహిళా సాధికారతపై కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ వంటి అంశాలపై అధ్యయనం చేశారు.
డాక్టర్ సూశన్ జాకబ్
అమెరికన్ సొసైటీ ఆఫ్ కేటరాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జరీ సమావేశం ముగించుకుని విమానాశ్రయంలో తిరుగు ప్రయాణం కోసం కూర్చున్నారు ప్రముఖ నేత్రవైద్యులు సూశన్ జాకబ్. అప్పుడామెకొచ్చిన ఓ ఆలోచన ఎందరో ఎదుర్కొంటున్న ఓ నేత్ర సమస్యకు పరిష్కారాన్నిచ్చింది. అదే ‘రిలాక్సింగ్ డెసిమెటోటొమీ’. ఈ నూతన టెక్నిక్‌ను ఆవిష్కరించిన ఈమెకు ఇదే మొదటిదికాదు. పలుచని కార్నియాకు కొత్తవిధానంలో చికిత్సనందించడం వంటి పద్ధతులెన్నింటినో ఈమె ఆవిష్కరించారు. తన కొత్త విధానాలతో డాక్టర్ సూశన్ అందిస్తున్న సేవలు ఆమెకు తాజాగా ‘పవర్ లిస్ట్ 2021’లో స్థానాన్ని కట్టబెట్టాయి. ఓ ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ఏటా ప్రపంచవ్యాప్తంగా ఈ విభాగంలో సేవలందించే వారిని ఎంపిక చేసి ఓ జాబితా రూపొందిస్తోంది. ఈ ఏడాది ఇందులో మనదేశం నుంచి ఎంపికైన ఏకైక వ్యక్తి డాక్టర్ సూశన్. 21 ఏళ్లుగా ఈ రంగంలో లక్షలమందికి నేత్ర చికిత్సలు అందించారీమె. కార్నియా, రిఫ్రాక్టివ్ సర్జికల్ రంగంలో సరికొత్త విధానాలతో తనదైన కృషి చేస్తున్నారు. అమెరికావంటి దేశాల్లోనూ తాను కనిపెట్టిన చికిత్సలను వినియోగించడం తనకు సంతృప్తిగా ఉందంటారీమె. ‘నేను పరిశోధించిన అక్యులోప్లాస్టీ టెక్నిక్‌ను విదేశాల్లో కూడా ఉపయోగిస్తున్నారు. నా విజయాల వెనుక పలువురు వైద్యులు స్ఫూర్తిగా నిలిచారు. అందరికీ కృతజ్ఞతలు. నా కుటుంబం ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది’ అని చెబుతున్న ఈమె ప్రస్తుతం చెన్నైలో సీనియర్ కన్సెల్టెంట్ ఆప్తమాలజిస్ట్. ఈమె సేవలకుగానూ ఎన్నో అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు డాక్టర్ సూశన్.
ఇదీ చదవండి: కీలక ఘట్టానికి సాగర్ పోరు.. పోలింగ్ ప్రక్రియ ప్రారంభం