Women's rights on Sirpurkar Commission: మహిళల భద్రత కోసం చట్టబద్ధమైన ప్రక్రియే అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా, ట్రాన్స్జెండర్ల సంఘాలు, మహిళా హక్కులు, పౌర హక్కుల సంఘాల కార్యకర్తలు డిమాండ్ చేశారు. మహిళలకు భద్రత, స్వేచ్ఛ పేరుతో పోలీసులు బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండించారు. దిశ హత్యాచార నిందితుల ఎన్కౌంటర్ కేసుపై సుప్రీంకోర్టుకు ఈ నెల 20న జస్టిస్. వి.ఎస్. సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదికను స్వాగతించారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి.. సంఘాలు పలు సిఫార్సులు చేశాయి.
దిశ హత్యాచార ఘటనలో ముగ్గురు మైనర్లతో సహా నిందితుల ఎన్‌కౌంటర్‌పై పాల్పడిన 10 మంది పోలీసులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఈ సంఘాలు డిమాండ్ చేశాయి. వారిపై హత్యాచారం కింద కేసు నమోదు చేయడంతో.. వారిని త్వరితగతిన విచారణ చేయాలని కోరాయి. అదే విధంగా నిందితుల ఎన్‌కౌంటర్‌తో మరుగున పడిన దిశ హత్యాచారం కేసుపై దర్యాప్తు చేయాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశాయి. ఎన్కౌంటర్లో మరణించిన నలుగురు నిందితుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం.. పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని పౌర హక్కుల సంఘాలు డిమాండ్ చేశాయి.
మహిళల రక్షణ పేరుతో చట్టాన్ని అతిక్రమించి పోలీసులు నిందితులను ఎన్కౌంటర్ చేయడం ద్వారా బాధితులు, వారి కుటుంబాలకు సరైన న్యాయం జరగదని మహిళా సంఘాల కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారానే మహిళల హక్కులను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిందితుల బూటకపు ఎన్‌కౌంటర్‌ను సమర్థించిన సీనియర్ పోలీసు అధికారులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు.. ఇలాంటి వాటికి మద్దతు పలకకుండా.. న్యాయ వ్యవస్థ ద్వారానే బాధితులకు న్యాయం జరిగేలా పోరాడాలని హితవు పలికారు.
ఇవీ చదవండి: కేంద్రం బాటలో రాష్ట్రాలు.. 'పెట్రో పన్ను' తగ్గింపు.. మరి మన సంగతేంటి?
22 లక్షల విలువైన మందుబాటిళ్లు.. రోడ్డు రోలర్‌తో తొక్కించారు..!