Woman SI carrying the dead body: ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం హాజీపురం గ్రామ అటవీ ప్రాంతం. పశువులను కాసేందుకు వాటి యజమానులు అప్పుడప్పుడూ అడవికి వస్తుంటారు. అలాగే ఈ రోజు కూడా వెళ్లారు. పశువులను మేపుతుండగా.. వారికి అకస్మాత్తుగా ముక్కుపటాలు ఎగిరిపోయేంత దుర్వాసన కలిగింది. ఏదైనా జంతువు చనిపోయిందేమో అని అనుకుంటూ అటూఇటూ చూశారు. చుట్టూ వెతికారు. అలా వెతుకుతుండగా.. అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాకయ్యారు. ఎందుకంటే అక్కడ కనిపించింది ఏ జంతువు మృతదేహమో కాదు.. మనిషిది. కుళ్లి కృశించి.. దుర్వాసన వెదజల్లుతూ కాపరులను భయాందోళనకు గురిచేంసింది. దీంతో వెంటనే స్థానిక పోలీసులకు సమాచారమందించారు. వెంటనే కనిగిరి సీఐ పాపారావు, హనుమంతునిపాడు ఎస్సై కృష్ణ పావని తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.
డోలిలా కట్టి
మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి.. దుర్వాసన వస్తుండటంతో మృతదేహాన్ని.. దగ్గరగా వెళ్లి చూడటానికి ఎవరూ సాహసం చేయలేదు. అలాంటప్పుడు ఆ శవాన్ని రహదారి వరకు తరలించడానికి ఎవరు మాత్రం ముందుకు రాగలరు. అసలే అటవీ ప్రాంతం కావడంతో అక్కడి నుంచి రహదారి వరకు శవాన్ని తరలించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో కృష్ణ పావని మరొకరి సాయంతో ఎదురు బొంగుకు మృతదేహాన్ని డోలిలా కట్టి.. సుమారు 5 కిలోమీటర్లు మోసుకొచ్చారు.
మానవత్వ పరిమళం
నడవటానికి వీలు లేని అటవీ ప్రాంతం నుంచి రహదారి ప్రాంతానికి అతి కష్టం మీద మృతదేహాన్ని మోసుకొచ్చారు. మానవత్వానికి ప్రతిరూపంగా నిలిచిన మహిళా ఎస్సై కృష్ణ పావనిపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ విధంగా.. ఆమెలో పరిమళించిన మానవత్వం.. శవం దుర్వాసననూ నిర్వీర్యం చేసిందనే చెప్పాలి. ఏమంటారు.?
ఇదీ చదవండి: Lokesh On Pegasus: పెగాసస్‌పై ఎలాంటి విచారణకైనా సిద్ధం: నారా లోకేశ్