Telangana Railway budget 2022: ఎన్ని బడ్జెట్లు వస్తున్నా.. ఎన్నేళ్లు గడుస్తున్నా.. తెలంగాణలో రైల్వేల ప్రగతి ఆశించిన రీతిలో పట్టాలెక్కడం లేదు. వివిధ రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్న రాష్ట్రం రైలు మార్గాల విషయంలో మాత్రం వెనుకంజలోనే ఉంది. కొత్త లైన్ల కోసం.. మెరుగైన సౌకర్యాల కోసం ఎన్నో డిమాండ్లు వస్తున్నా వాటికి అతీగతీ ఉండటం లేదు. రైల్వేశాఖ.. సర్వేలకు ఆమోదం తెలపడంతోనే సరిపెట్టుకుంటోంది. బడ్జెట్లో కొత్త లైన్ల ఊసే ఎత్తడం లేదనే విమర్శలున్నాయి. వీటికి తోడూ ఉన్న లైన్లను విస్తరించడం లేదు.
ఓ రకంగా జాప్యానికి రాష్ట్రమే కారణం!
Budget Allocation for Telangana Railways: యాదాద్రి ప్రాజెక్టు మంజూరై నాలుగేళ్లు దాటినా ఇప్పటికీ ఒక్క అడుగు ముందుకు పడలేదు. పగిడిపల్లి(బీబీనగర్)-నల్లపాడు మధ్య రెండో లైనుకు తుది సర్వే పూర్తయినా నిధులు మంజూరు కాలేదు. సికింద్రాబాద్-కాజీపేట మూడో లైను సర్వే పూర్తయినా రైల్వే బోర్డు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కొన్ని ప్రాజెక్టుల జాప్యానికి రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించకపోవడం, ఒప్పందానికి ముందుకు రాకపోవడం వంటి సమస్యలూ కారణంగా ఉన్నాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రైల్వే రూట్లో తెలంగాణ చాలా వెనుకబడి ఉంది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ 9,077 కిమీల రూట్‌తో మొదటి స్థానంలో ఉండగా , గుజరాత్ 5,294 కిమీల రూట్‌తో 5వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 3,713 కి.మీల రూట్ తో 9వ స్థానంలో, తెలంగాణ 1,870కిమీలతో 14వ స్థానంలో ఉంది.
ఎన్నిసార్లు విన్నవించినా వినరే..
Budget Allocation for Railway Sector: కొత్త రైళ్లు, అదనపు రైల్వే మార్గాలపై రాష్ట్ర ఎంపీల నుంచి అనేక డిమాండ్లు ఉన్నాయి. కాజీపేట-హుజూరాబాద్-కరీంనగర్, ఆర్మూర్-నిర్మల్-ఆదిలాబాద్, పటాన్‌చెరు-సంగారెడ్డి-మెదక్, ఘన్‌పూర్-సూర్యాపేట వయా పాలకుర్తి తదితర కొత్త లైన్ ప్రాజెక్టులు ప్రతిపాదన దశలోనే ఉన్నాయి. వీటిలో కొన్నింటి సర్వేలు మాత్రమే పూర్తయ్యాయి. మరికొన్ని ప్రాజెక్టులకు సర్వేలు కూడా జరగకపోవడం వల్ల ముందుకు కదలడం లేదని రాష్ట్ర ఎంపీలు అనేకసార్లు రైల్వే బోర్డుకు వినతిపత్రాలు అందజేశారు.
డబ్లింగ్ పనులు పెండింగే..
Railway Budget 2022-23 : సికింద్రాబాద్ నుంచి బెంగళూరు వరకు లైన్‌ను డబ్లింగ్ చేయాల్సి ఉంది. సికింద్రాబాద్-శ్రీశైలం రోడ్, మణుగూరు-రామగుండం లైన్లు ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. ఈసారైనా ఈ ప్రాజెక్టులపై కేంద్రం కరుణించాలని అటు స్థానికులు ఇటు ఎంపీలు కోరుతున్నారు. కాజీపేటలో పీరియాడికల్ ఓవర్ హాలింగ్ ప్రాజెక్టు మంజూరై ఏళ్లు గడుస్తున్నా పనులు ప్రారంభం కాలేదు. వాస్తవానికి విభజన హామీల్లో భాగంగా కాజీపేట్‌లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎంపీలు చాలా ఏళ్లుగా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. కానీ.. గత బడ్జెట్లో అప్పటి రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా కోచ్ ఫ్యాక్టరీ రైల్వేకు ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఇక ఆ ఆలోచనలు ఆవిరైనట్లే కన్పిస్తున్నాయి. కనీసం ఓవర్ హాలింగ్ ప్రాజెక్టు పనులైనా ప్రారంభిస్తే.. కాస్త ఊరటగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కొత్తవి ఇవ్వరు ఓకే.. ఖాళీలైనా భర్తీ చేయండి..
Union Budget 2022-23 : ఘట్‌కేసర్-కాజీపేట వరకు మూడో లైను వేస్తే ఏపీ, తమిళనాడు వైపు ఉత్తరాది రాష్ట్రాలకు ప్రయాణం సులభం అవుతుందని ప్రజలు కోరుతున్నారు. హైదరాబాద్-విజయవాడకు జాతీయ రహదారి పక్కనుంచి హైస్పీడ్ రైలు ప్రాజెక్టు వస్తే దూరం 50-60 కి.మీ. తగ్గుతుందని రాష్ట్ర ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ దిశగా బడ్జెట్లో ఆలోచన చేయాలని తెలుగు రాష్ట్రాల ప్రజల నుంచి వినతులు వస్తున్నాయి. చర్లపల్లిలో టర్మినల్ ఏర్పాటు చేస్తే.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌పై ఒత్తిడి తగ్గుతుంది. కానీ.. వీటికి సంబంధించిన పనులు అనుకున్న స్థాయిలో జరగడం లేదు. గత బడ్జెట్లో తక్కువ నిధులు కేటాయించడం వల్ల ఆశించిన స్థాయిలో పనులు జరిగడం లేదని అధికారులు చెబుతున్నారు. వీటికి తోడు రైల్వేలో 20 వేల ఖాళీలు ఉన్నాయని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. వాటిని త్వరితగతిన పూర్తిచేయాలని కోరుతున్నారు.
- ఇదీ చదవండి : పరిమితుల మధ్యే నిర్మలమ్మ బడ్జెట్.. వరాలిస్తారా?
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!