లాక్డౌన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమలకు వాహనాలు, భక్తుల రాకపోకలను తితిదే రద్దుచేసింది. నిర్మానుష్యంగా మారిన తిరుమల క్షేత్రంలో చిరుతపులులు తిరుగుతూ కలకలం సృష్టిస్తున్నాయి. సోమవారం రాత్రి శ్రీత్రిదండి రామచంద్ర రామానుజ జీయరు స్వామి మఠం సమీపంలో చిరుత సంచరించినట్లు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఇటీవల బాలాజీనగర్‌కు సమీపంలో రోడ్డు దాటుతున్న దృశ్యం కెమెరాలో చిక్కింది. రాత్రి వేళ స్థానికులు, తితిదే సిబ్బంది బయటకు రావొద్దంటూ అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
బంగారు బల్లి దర్శనం...
తిరుమలలో స్థానిక చక్రతీర్ధం వద్ద అరుదైన బంగారు బల్లి దర్శనమిచ్చింది. ప్రస్తుతం ప్రశాంతంగా ఉండడం వల్ల బంగారు బల్లి బయటకు వచ్చినట్లు అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు.
పద్మావతిలోనూ.. వన్యప్రాణులు
నెల రోజులుగా ఎస్వీయూ భవనాల చుట్టూ చేరుతున్న జింకలు, అడవి పందులు, ఇతర జంతువులు ప్రస్తుతం పద్మావతి అతిథి గృహం మీదుగా చిత్తూరుకు వెళ్లే ప్రధాన రహదారి వరకు వచ్చేస్తున్నాయి. జింకల గుంపుల్లో కొన్ని దారి తప్పిపోయి తికమక పడుతున్నాయి.
హార్సిలీహిల్స్‌లో చిరుతపులుల కలకలం
హార్సిలీహిల్స్ అటవీ ప్రాంతంలో చిరుతపులి కదలికలు కొనసాగుతున్నాయి. కొండపై ఉన్న వివిధ ప్రాంతాల్లో చిరుతపులి సంచరిస్తుండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇక్కడ కొన్నేళ్లుగా చిరుతపులి తిరుగుతున్నట్లుగా స్థానికులు గుర్తించారు. లాక్‌డౌన్‌తో కొండపై పర్యాటకుల రద్దీ లేకపోవడం వల్ల జంతువులు కొండపై ఉన్న నివాస గృహాల వైపునకు వస్తున్నాయి.
ఇదీ చదవండి... పరిశ్రమలను ఆదుకోండి... ప్రధానికి సీఎం లేఖ