ఏపీలోని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. పార్లమెంట్లో స్పీకర్ ఓం బిర్లాను వైకాపా ఎంపీల బృందం కలిసింది. అనంతరం భేటీ వివరాలను వైకాపా ఎంపీలు మీడియాకు వెల్లడించారు.
పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారు..
రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు పిటిషన్ ఇచ్చాం. అన్ని విషయాలు పరిశీలించాక చర్యలు తీసుకుంటానని స్పీకర్ హామీ ఇచ్చారు. ఏ పార్టీ తరఫున ఎంపీగా ఉన్నారో ఆ పార్టీపైనే రఘురామకృష్ణరాజు ఆరోపణలు చేస్తున్నారు. స్వపక్షంలో విపక్షంలా రఘురామకృష్ణరాజు ప్రవర్తిస్తున్నారు. రఘురామకృష్ణరాజు పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారు. ఊహాజనితమైన విషయాలను ఊహించుకుని ప్రజలకు సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏదైనా అసంతృప్తి ఉంటే పార్టీ అధినేత దృష్టికి తీసుకురావాలి. రఘురామకృష్ణరాజు క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు స్పష్టంగా కనబడుతోంది. బహిరంగంగా పార్టీ నియమావళి, క్రమశిక్షణను ఉల్లంఘించారు -విజయ సాయిరెడ్డి
తెదేపా నేతల ప్రోద్బలంతోనే..
ఏపీ సీఎం జగన్.. రఘురామకృష్ణరాజుకు సముచిత స్థానం కల్పించారు. ఆయన కోరిన వెంటనే కమిటీ ఛైర్మన్ పదవి వచ్చేలా చూశారు. కానీ రఘురామకృష్ణరాజు తెదేపా హయాంలో తీసుకున్న నిర్ణయాలను ప్రస్తుత ప్రభుత్వానికి ఆపాదించారు. సొంత పార్టీ నేతలపై దూషణలు చేయటం సరికాదు. తెదేపా నేతల ప్రోద్బలంతోనే రఘురామకృష్ణరాజు ఇలాంటి విమర్శలు చేస్తున్నారు. తెదేపా నుంచి భాజపాకు వలస వెళ్లిన నేతల అండతోనే మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ అంటే కూడా యువజన శ్రామిక రైతు పార్టీనే- మిథున్‌రెడ్డి
ఆత్మపరిశీలన చేసుకోవాలి..
రఘురామకృష్ణరాజు మీడియాలో మాట్లాడుతున్న విధానాన్ని గమనించాం. అందుకే ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు పిటిషన్ ఇచ్చాం. రఘురామకృష్ణరాజుకు అన్ని విధాల సముచిత స్థానం కల్పించారు. ఆయన ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది- మార్గాని భరత్