రాష్ట్రంలో కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పోటెత్తాయి. ఫలితంగా చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. ఎక్కడ ఏ చెరువు చూసినా నీటితో కళకళలాడుతోంది. చాలా చెరువులు పూర్తిగా నిండి ప్రవహిస్తున్నాయి. సగానికి పైగా చెరువులు అలుగు పోస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో మొత్తం 43,412 చెరువులు ఉండగా.. ఇప్పటికే నిన్నటి వరకు 20వేలకు పైగా చెరువులు పూర్తిగా నిండి మత్తడి దూకుతున్నాయి. మరో ఆరువేలకు పైగా చెరువులు 75 శాతం నుంచి వంద శాతం నిండాయి. గోదావరి పరివాహక ప్రాంతంలో 75 శాతం చెరువులు నిండినట్లే.
గోదావరి బేసిన్లో..
ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో వందకు వంద శాతం అన్ని చెరువులు నిండి అలుగు పోస్తున్నాయి. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల్లోనూ ఒకటి, రెండు తప్ప అన్నీ మత్తడి దూకుతున్నాయి. మిగిలిన చెరువులు కూడా 90 శాతానికి పైగా నిండాయి. మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోనూ కొన్నింటిని మినహాయిస్తే మిగతా చెరువులన్నీ పూర్తిగా నిండాయి. గోదావరి బేసిన్లోని 20వేలకు పైగా చెరువుల్లో 14వేలకు పైగా మత్తడి పోస్తున్నాయి. మరో మూడు వేల వరకు 75 శాతం నుంచి వంద శాతం నిండాయి. కేవలం 1500 చెరువులు మాత్రమే 50శాతం లోపు నిండాయి.
కృష్ణా బేసిన్లో..
రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో చెరువులు కొంత మేర తక్కువగా నిండాయి. కృష్ణా బేసిన్లోని 23వేల చెరువుల్లో ఆరువేలకు పైగా చెరువులు మత్తడి పోస్తున్నాయి. మరో 3,500 చెరువులు 75 నుంచి వంద శాతం నిండాయి. వనపర్తి, సిద్దిపేట జిల్లాల్లో మూడొంతుల చెరువులు అలుగు పారుతున్నాయి. సూర్యాపేట, నారాయణపేట, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లోనూ చెరువులు కూడా బాగానే నిండాయి.
పెద్దగా దెబ్బతినలేదు..
వర్షాలు విస్తారంగా పడ్డప్పటికీ చెరువులు గతంతో పోలిస్తే దెబ్బతిన్నవి చాలా తక్కువని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం 43వేలకు పైగా చెరువుల్లో కేవలం 177 మాత్రమే వర్షాల వల్ల దెబ్బతిన్నాయి. 75 చోట్ల కట్ట తెగగా... 29 చోట్ల బుంగలు పడ్డాయి. అవి కూడా చిన్న చిన్న చెరువులేనని నీటిపారుదల శాఖ చెబుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం కింద పునరుద్ధరించిన చెరువుల కట్టలు ఎక్కడా తెగలేదని, బుంగలు పడలేదని అంటోంది.
ఇవీ చూడండి: అలుగుపోస్తున్న చెరువులు... పలుచోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు..