వక్ఫ్ బోర్డు ఆస్తులను కబ్జా చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని బోర్డు ఛైర్మన్ మహమ్మద్ సలీం తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కొన్ని చోట్ల వక్ఫ్ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నట్లు గుర్తించామన్నారు. వాటి రిజిస్ట్రేషన్లు రద్దు చేసి తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై హైదరాబాద్ నాంపల్లిలోని హజ్‌హౌస్‌లో బోర్డు సభ్యులతో ఛైర్మన్ సమావేశం నిర్వహించారు.
వక్ఫ్ ఆస్తులు తక్కువ ధరకు లీజుకు తీసుకొని చలామణి అవుతున్నారని... ప్రస్తుత మార్కెట్ ధర మేరకు లీజ్ కేటాయిస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న మజీద్‌లను ఆధునికీకరిస్తామని... పబ్లిక్‌గార్డెన్‌లో ఉన్న మజీద్‌ను నూతన హంగులతో పునర్నిర్మించి హైదరాబాద్‌లోనే నంబర్ వన్ మజీద్గా తీర్చిదిద్దుతామన్నారు. మజీద్ల నిర్వహణ కోసం ముత్తవల్లిలను, పెండింగ్‌లో ఉన్న లీజ్ అమౌంట్లను వసూళ్లు చేసేందుకు కలెక్షన్ ఇన్స్పెక్టర్లను నియమిస్తున్నట్లు సలీం స్పష్టం చేశారు.