రిజర్వేషన్లు ఇంకెన్ని తరాలు అని సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంత రావు తప్పుబట్టారు. రిజర్వేషన్లు పూర్తిస్థాయిలో అమలయ్యాయా అని ప్రశ్నించారు. తమ పోరాటం వల్లే క్రిమిలేయర్ను రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచారని తెలిపారు.
పేరుకే 27శాతం ఓబీసీ రిజర్వేషన్లు తప్పితే 9 శాతం కూడా సక్రమంగా అమలు కావడం లేదని వీహెచ్ అన్నారు. జనాభాలో 50 శాతం ఉన్న ఓబీసీలకు అన్యాయం జరుగుతోందని తెలిపారు. 27 శాతం అమలైతే ఎందుకు కొట్లాడతామని ప్రశ్నించారు. అగ్రకులాలకు పది శాతం రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.
సుప్రీం వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని వీహెచ్ డిమాండ్ చేశారు. ఓబీసీలకే క్రిమిలేయర్ ఎందుకన్నారు. న్యాయవ్యవస్థ కూడా బీసీలకు అన్యాయం చేయొద్దని కోరారు. వెంటనే జనాభా లెక్కలు చేపట్టి.. జనాభా దమాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
- ఇదీ చదవండి : డబ్బు లేకుంటే ఎన్నికల్లో పోటీ చేయకూడదు: చిన్నారెడ్డి