విజయవాడలోని ప్రైవేట్ కొవిడ్ సెంటర్ స్వర్ణ ప్యాలెస్‌లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 10 మంది చనిపోయారని ఏపీ మంత్రులు తెలిపారు. విజయవాడ ఏలూరు రోడ్డులో హోటల్ స్వర్ణ ప్యాలెస్ ఉంది. రమేష్ హాస్పిటల్ దీన్ని అద్దెకు తీసుకుని, కొవిడ్ కేర్ సెంటర్‌గా మార్చి కరోనా రోగులకు చికిత్స అందిస్తోంది. ఆస్పత్రిలో బెడ్ల కొరత కారణంగా కొందరిని ఈ హోటల్‌లో ఉంచి చికిత్స అందిస్తోంది. ఘటన సమయంలో ఈ ఆస్పత్రిలో 31 మంది రోగులు, వైద్య సిబ్బంది, ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని వివిధ ఆస్పత్రులకు తరలించారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఘటనపై విచారణకు ఆదేశించింది.
విజయవాడ అగ్నిప్రమాద ఘటనపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆస్పత్రి, హోటల్ యాజమాన్యాలపై గవర్నర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడ సెంట్రల్ తహసీల్దార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. 48 గంటల్లో దర్యాప్తు పూర్తిచేసేందుకు 2 కమిటీలను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విచారణలో భాగంగా స్వర్ణ ప్యాలెస్‌లోని సీసీ కెమెరా దృశ్యాల హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు.
స్వర్ణప్యాలెస్ ప్రమాదానికి కారణమైన మంటలు తొలుత హోటల్ గ్రౌండ్ ఫ్లోర్‌లోని రిసెప్షన్‌లో మొదలయ్యాయని తెలుస్తోంది. ఈ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు ఐదు అంతస్తులు ఉన్నాయి. రిసెప్షన్ సమీపంలో విద్యుత్ వైఫల్యం వల్ల నిప్పంటుకుని మంటలు వ్యాపించాయి. రిసెప్షన్ పక్కనుంచి మెట్లు ఉండటం వల్ల పొగ మొత్తం పై అంతస్తులకు వెళ్లినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ ప్రమాదంలో 10 మంది మృతిచెందగా.. వారిలో ఎక్కువ మంది పొగ పీల్చుకోవటం వల్ల చనిపోయారని.. ఇద్దరు కాలిన గాయాలతో మరణించగా, మరొకరు ఆస్పత్రిలో చనిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. కరోనా రోగులు ఉన్న హోటల్ కావడంతో సహాయ చర్యలు చేపట్టేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి లోపలికి వెళ్లి మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు.
ఏపీ డీజీపీ గౌతం సవాంగ్, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అగ్నిప్రమాదం జరిగిందని తమకు ఉదయం 5:06 గంటలకు సమాచారం అందిందని సవాంగ్ చెప్పారు. విషయం తెలిసిన ఐదు నిమిషాల్లో పోలీసు, అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారని వివరించారు. 5:45 గంటలకల్లా మంటలను ఆర్పివేసి 20 మందికిపైగా రక్షించామన్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కిటికీ అద్దాలను పగలగొట్టి నిచ్చెన సాయంతో పలువురిని కిందికి తీసుకువచ్చారు.
రూ.50 లక్షల చొప్పున పరిహారం: ఏపీ సీఎం
అగ్నిప్రమాద ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే తక్షణ చర్యలకు ఆదేశించారు. పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరాతీశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ప్రమాదానికి గురైన వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఘటనపై లోతుగా విచారణ జరపి తనకు నివేదించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి జగన్‌కు ప్రధాని ఫోన్..
ప్రధాని మోదీ సీఎం జగన్‌కు ఫోన్ చేశారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఒక ప్రైవేటు హాస్పిటల్ ఈ హోటల్‌ను లీజుకు తీసుకుని అందులో కరోనా పేషెంట్లను ఉంచిందని, తెల్లవారు జామున అగ్నిప్రమాదం జరిగిందని సీఎం జగన్ ప్రధానికి చెప్పారు. అధికారులు వెంటనే సహాయక చర్యలను చేపట్టారని వివరించారు. కొందరు చనిపోయారని తెలిపారు. ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించామని ప్రధాని మోదీకి జగన్ తెలిపారు.
ప్రముఖుల దిగ్భ్రాంతి...
హోటల్ స్వర్ణ ప్యాలస్ అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. మంత్రులు ఆళ్లనాని, పేర్ని నాని, మేకతోటి సుచరిత, వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఘటనా స్థలాన్ని సందర్శించారు. బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మృతుల వివరాలు...
1. కొసరాజు సువర్ణలత...గృహిణి (42)... గుంటూరు జిల్లా పొన్నూరు మండలం నిడబ్రోలు
2.డొక్కు శివబ్రహ్మయ్య (59) బెల్ కంపెనీ మేనేజర్, మచిలీపట్నం ( మూడు రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యాక చేరారు)
3.పొట్లూరి పూర్ణచంద్రరరావు (80).. కొడాలి, ఘంటశాల కృష్ణా జిల్లా. గుంటూరు సీపీఓగా గతంలో పనిచేశారు. రిటైర్ అయిన తర్వాత పీఏసీఎస్ అధ్యక్షుడిగా చేశారు. లంగ్ ఇన్ఫెక్షన్‌తో కొవిడ్ సెంటర్‌లో చేరారు
4. సుంకర బాబూరావు (80) రిటైర్డ్ ఎస్సై. ఇందిరానగర్, అజిత్‌సింగ్‌నగర్
5. మజ్జి గోపి (54). మచిలీపట్నం
6. జి.వెంకట జయలక్ష్మి (52) కందుకూరు, ప్రకాశం జిల్లా
7. వెంకట నర్సింహ పవన్ కుమార్, కందుకూరు, ప్రకాశం జిల్లా
8.9. సబ్బిలి రత్న అబ్రహం(48), రాజకుమారి(భార్యభర్తలు), జగ్గయ్యపేట
10. మద్దాలి రఘు, మొగల్రాజపురం