vehicle number plate issue : రాష్ట్ర రాజధానిలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల తీరుపై పోలీసులు ఇటీవల విశ్లేషించారు. కొంతమంది ద్విచక్ర వాహనదారులు నిబంధనలు పట్టించుకోకుండా అడ్డుదారుల్లో వెళ్తూ ఇతరుల మృతికి కారణమవుతున్నారని గుర్తించారు. ఇటువంటి వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలన్న నిర్ణయానికి వచ్చారు.
పోలీసుల నుంచి తప్పించుకునేందుకు చాలామంది ఏకంగా వాహనాల నంబరు ప్లేట్లను తీసివేసి తిప్పుతున్నారు. ఇటువంటి వారిపై నిఘా కెమెరాల ద్వారా పోలీసులు జరిమానా విధించే అవకాశం లేదన్న ఉద్దేశంతో అతివేగంగా వెళ్లి ప్రమాదాలకు కారణమవుతున్నారు. దీనిపై సమీక్షించిన ట్రాఫిక్ విభాగం సంయుక్త కమిషనర్ ఏవీ రంగనాథ్.. నంబరు ప్లేటు లేకుండా నడుపుతున్న వాహనదారులను అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పక్షం రోజులుగా పోలీసులు తనిఖీలు మొదలుపెట్టారు.
ఇప్పటి వరకు 180 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. వాహనాలనూ జప్తు చేశారు. మరో రెండు నెలలపాటు ఈ తనిఖీలు కొనసాగించాలని నిర్ణయించారు. మరికొంతమంది వాహనాలకు నంబరు ప్లేట్లు ఉన్నా ఏదో ఒకవైపు వంచడం..ఒక అంకెను చెరిపేయడం చేస్తున్నారు. దీంతో సీసీ కెమెరాలకు, పోలీసులు తీసే ఫొటోలకు దొరికే అవకాశం లేదు. ఇలాంటి వారిపైనా ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తున్నారు. వాహనాన్ని జప్తు చేయడంతో వీరు కూడా కోర్టు మెట్లు ఎక్కాల్సిందే. ఇలా 150 మందిపై కేసులు నమోదయ్యాయి.
ఇంకొందరు తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్) నంబరు ప్లేట్లు పెట్టుకుని తిరుగుతున్నారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం టీఆర్‌తో నెలరోజులపాటు తిరగడానికి మాత్రమే అవకాశం ఉంది. ఈ లోపుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సిందే. లేదంటే అలాంటి వారిపైనా కేసు నమోదు చేస్తున్నారు. నగరంలో 60 కిలోమీటర్ల వేగంతో కార్లలో ప్రయాణించడానికి వీలుంది. 60-120 వేగంతో వెళితే జరిమానా విధిస్తున్నారు. అంతకుమించితే మాత్రం కేసులు నమోదు చేస్తున్నారు.