తిరుమల శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీనివాసుని సన్నిధి నుంచి ఉభయనాంచారులతో కలసి శ్రీమలయప్పస్వామివారు రంగనాయకుల మండపానికి చేరుకున్నారు. ఉత్సవమూర్తులకు ఆలయ పెద్ద జీయర్, చిన్న జీయర్‌ల సమక్షంలో మంగళవాయిద్యాలు, పండితుల వేద మంత్రోచ్ఛరణల మద్య స్నపనతిరుమంజనం నిర్వహించారు.
ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం చేపట్టారు. అనంతరం ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం సమర్పించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. అనంతరం ఆస్థానాలను అర్చకులు వేడుకగా నిర్వహించారు. ఉత్సవాలను పురస్కరించుకుని రంగనాయకుల మండపాన్ని వివిధ రకాల పుష్పాలతో సుందరంగా ముస్తాబు చేశారు. కరోనా ప్రభావంతో వసంతోత్సవాలను ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి:
తితిదేకు రూ.24 లక్షల బస్సును విరాళంగా ఇచ్చిన తమిళనాడు భక్తుడు