మహిళలకు సోకే క్యాన్సర్ల(Breast Cancer Victims)లో రొమ్ము క్యాన్సర్(Breast Cancer Victims) మొదటి స్థానంలో ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకున్నామని తెలియగానే.. మహిళలు దిగ్భ్రాంతి, భయం, కోపం, నిస్సహాయత వంటి పలు భావోద్వేగాలకు లోనవుతారు. చికిత్స సమయంలో క్రమేపీ కుంగుబాటుకు గురవుతారు. వారికి కౌన్సెలింగ్ చేయడం చాలా అవసరం. ఈ ఉద్దేశంతోనే బాధితుల్లో మనోధైర్యం నింపడానికి ‘ఉషాలక్ష్మి రొమ్ము క్యాన్సర్ ఫౌండేషన్(Usha Lakshmi Breast Cancer foundation) తొలిసారిగా ఉచిత హెల్ప్‌లైన్ నంబరు '08046983383'ను అందుబాటులోకి తీసుకొస్తోంది. బాధితుల్లో భరోసా నింపేందుకు.. ఇప్పటికే రొమ్ము క్యాన్సర్‌ను జయించిన వారిని ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. క్యాన్సర్‌కు చికిత్సలో అవసరమైన సమాచారాన్ని క్రోడీకరిస్తూ ఈ ఫౌండేషన్ www.ubfhelp.org వెబ్‌సైట్‌నూ రూపొందించింది. ఈ రెండూ అక్టోబరు 1 నుంచి అందుబాటులోకి వస్తాయి. వీటిని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు గురువారం సాయంత్రం 4 గంటలకు వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు.
ఇదీ విధానం... ఉపయోగం...
- మొబైల్ లేదా ల్యాండ్‌లైన్ నుంచి హెల్ప్‌లైన్ నంబరును సంప్రదించవచ్చు.
- కాల్ చేసి మొదట భాషను ఎంచుకోవాలి. ఇంగ్లిషుకు 1, తెలుగుకు 2, హిందీ అయితే 3 అంకెను నొక్కాలి.
- క్యాన్సర్ సమస్య ఉంటే 1 అంకెను, క్యాన్సర్ కాని కణుతుల సమస్య అయితే 2 అంకెను నొక్కాలి. దీంతో బాధితుల ప్రాథమిక సమాచారం నిక్షిప్తమవుతుంది.
- సంస్థలో శిక్షితులైన క్యాన్సర్ విజేతలు 24 గంటల్లోగా బాధితులకు ఫోన్ చేసి మాట్లాడతారు. వ్యాధిపై అవగాహన కల్పించి, ధైర్యం చెబుతారు. అవసరమైతే సైకాలజిస్టులతో మాట్లాడిస్తారు. 25 మంది సైకాలజిస్టులకు ఈ కోణంలో శిక్షణ ఇచ్చి సిద్ధం చేశారు. ఆహార సలహాలివ్వడానికి పౌష్టికాహార నిపుణులను కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు.
వచ్చే ఏడాదిలోగా అన్ని భారతీయ భాషల్లోకి..
"ఏటా 90 వేల మంది రొమ్ము క్యాన్సర్(Breast Cancer Victims)తో మృతి చెందుతున్నారు. అవగాహన లేకపోవడం, ముందస్తు పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల 60 శాతానికి పైగా బాధితులు క్యాన్సర్ ముదిరిన తర్వాతే చికిత్స కోసం వస్తున్నారు. రొమ్ము క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించాలి. ప్రతి మహిళ అవగాహన కలిగి ఉండాలి. అనుమానం ఉంటే వైద్యులను సంప్రదించాలి. 40 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళ.. ఏటా మమ్మోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలి. ఇటువంటి హెల్ప్‌లైన్ మన దేశంలో ఇప్పటి వరకూ లేదు. ప్రస్తుతం తెలుగు, హిందీ, ఇంగ్లిషు మాధ్యమాల్లో మాట్లాడడానికి ఏర్పాట్లు చేశాం. వచ్చే ఏడాదిలోగా భారతీయ భాషలన్నింటిలోనూ అందుబాటులోకి తీసుకొస్తాం."
- డాక్టర్ రఘురాం, సీఈవో, ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్
- ఇదీ చదవండి : కొవిడ్ సోకిందని పిల్లులను చంపిన అధికారులు!