తెలుగు రాష్ట్రాల్లో సేద్యం తీరు మారుతోంది. అధునాతన వ్యవసాయ యంత్రాల వినియోగంతో సగం ఖర్చులు తగ్గుతున్నాయి. రోజుకోటి పుట్టుకొస్తున్న యంత్రాలు మన నేలకు, పంటలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనే అంశాలను ధ్రువీకరించాలని కొన్ని వ్యవసాయ వర్సిటీలను భారతీ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) ఎంపిక చేసింది. తెలంగాణలో రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ వర్సిటీ కూడా అందులో ఉంది. ఇక్కడ వ్యవసాయ యంత్రాల పరీక్షల కేంద్రాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో డ్రోన్ల వినియోగం పెరుగుతోంది. పురుగుమందుల పిచికారీకి కొందరు రైతులు వాడుతున్నారు. వర్సిటీలు సైతం పంటల సాగు క్షేత్రాల్లో ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నాయి. వచ్చే ఏడాదిలో రాయితీపై వ్యవసాయ యంత్రాలు ఇస్తామని వ్యవసాయ శాఖ తెలిపింది.

డ్రోన్లతో ప్రయోగాలు

డ్రోన్లతో అనేక రకాల వ్యవసాయ పనులు చేయవచ్చు. పురుగు మందుల పిచికారీతో పాటు తెగుళ్ల విస్తృతిని అంచనా వేస్తున్నారు. ఏపీకి చెందిన ఆచార్య ఎన్జీ రంగా, తెలంగాణకు చెందిన జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు డ్రోన్లతో విస్తృతంగా ప్రయోగాలు చేపట్టాయి. రసాయన సామర్థ్యం పెంచాల్సిన పనిలేకుండా మార్కెట్లో దొరికే పురుగు మందులనే వినియోగిచుకోవచ్చని నిరూపించేలా ఈ పరిశోధనలు సాగుతున్నాయి.
* స్థానికంగా ఎవరైనా డ్రోన్ సమకూర్చుకుంటే రోజుకు 30 ఎకరాల్లో పిచికారీ చేయొచ్చు. ఎకరాకు రూ.400 చొప్పున తీసుకున్నా రూ.12 వేల ఆదాయం వస్తుంది.
* ఎకరా విస్తీర్ణంలో పంటకు పురుగుమందును కూలీలను పెట్టి పిచికారీ చేయిస్తే కనీసం రూ.వెయ్యి ఖర్చవుతుంది. డ్రోన్ వాడితే ఒక పిచికారీలోనే రైతుకు రూ.500 నుంచి రూ.600 ఆదా అవుతుంది.
* ఎకరం పైరుపై ఆరు నిమిషాల్లో పిచికారి చేయొచ్చు.
* సాధారణ కూలీలు చేసే పిచికారీతో పోలిస్తే డ్రోన్ ద్వారా ప్రస్తుతానికి 25 శాతం పురుగు మందుల్ని తగ్గించి ప్రయోగాలు చేస్తున్నారు. భవిష్యత్తులో దీన్ని 50 శాతం వరకు తీసుకెళ్లాలనేది శాస్త్రవేత్తల లక్ష్యం.
* పెట్రోలు, డీజిల్ ఖర్చు ఉండదు.
* వ్యవసాయంలో డ్రోన్ల ద్వారా 21 రకాల సేవలు అందించవచ్చు.
* పురుగు మందులు, ఎరువులు చల్లుకోవచ్చు. పొలాల్లో విత్తనాలనూ చల్లుకోవచ్చు.
వరి నాట్ల యంత్రం
కూలీలతో ఎకరం విస్తీర్ణంలో వరి నాట్లు వేయడానికి రూ.5 వేలు ఖర్చవుతుందని.. యంత్రం సాయంతో రూ.200 పెట్రోలు ఖర్చుతో గంటన్నర వ్యవధిలో వాటిని వేయవచ్చని రైతులు చెబుతున్నారు. యంత్రం అద్దెకు తీసుకున్నా వెయ్యి రూపాయలతో పని పూర్తవుతుందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల రైతులు సేద్యంలో యంత్రాల వినియోగంపై దృష్టి సారిస్తున్నారు.
పరీక్షల్లో పాసయితేనే వ్యవసాయ క్షేత్రాలకు

వ్యవసాయ యంత్రాలను తయారు చేసిన కంపెనీలు.. తెలుగు రాష్ట్రాల్లో వాటి వినియోగం, నాణ్యతను ధ్రువీకరించడం కోసం ఆచార్య జయశంకర్ వర్సిటీ ప్రయోగశాలకు పంపాయి. మొత్తం 72 సాంకేతిక అంశాలను పరీక్షించి రైతులకు ఉపయోగపడతాయని తేలితేనే వర్సిటీ ధ్రువీకరణ పత్రం ఇస్తుంది. ఆ తర్వాతే కంపెనీలు మార్కెట్‌లో అమ్మకానికి పెడతాయి.
20 నిమిషాల్లోనే ఎకరం పైరుపై పిచికారీ

ఈ యంత్రం ధర రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఉంది. ఎకరం పొలంలో 20 నిమిషాల వ్యవధిలోనే పురుగు మందులు పిచికారి చేసుకోవచ్చు. కలుపు నివారణ మందులకు ప్రత్యేక నాజిల్‌్్స కూడా ఉంటాయి.
* బావి, చెరువుల నుంచి నీటిని తోడుకుంటుంది. పురుగుమందు పోస్తే కలుపుకుంటుంది. పిచికారీ పూర్తయిందాకా మందు, నీటిని కలుపుతూనే ఉంటుంది.
* పత్తిలో అయితే 8 వరసల మొక్కలకు ఒకేసారి మందు చల్లుతూ వెళుతుంది.
వరిగడ్డి మోపులు కట్టేస్తుంది

వరి కోతలకు యంత్రాలను వాడుతున్నచోట కోత అనంతరం పొలంలో గడ్డి ముక్కలు ముక్కలుగా పడుతుంది. రైతులు పొలంలోనే తగలబెట్టేస్తున్నారు.కాలుష్యం పెరుగుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి గడ్డిని బేళ్లు(మోపులుగా) చేసే యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. గుండ్రంగా.. బేళ్లు మాదిరిగా గడ్డిని కట్టలు కట్టే యంత్రం ఖరీదు రూ.3.30 లక్షల వరకు ఉంది. గంటా ఇరవై నిమిషాల సమయంలో ఎకరా విస్తీర్ణంలో బేళ్లు తయారు చేస్తుంది.
చెరకు నరికి.. ముక్కలుచేసి

సరైన సమయంలో చెరకు గడలను కత్తిరించి మిల్లుకు చేరవేస్తేనే చక్కెర శాతం అధికంగా వస్తుంది. అలాగే గడ కింది భాగంలో చెరకు రసం అధికంగా ఉంటుంది. అయితే కూలీలు అంత వరకు కత్తిరించలేరు.
* ప్రస్తుతం గడను కింది వరకు కత్తిరించే యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి.అవే చిన్న ముక్కలుగా చేస్తాయి వెంటనే మిల్లుకు తరలించుకోవచ్చు. దీనివల్ల సమయం ఆదా అవుతుంది.
* ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కొన్ని యంత్రాలను అందుబాటులోకి తెచ్చారు. ఒక్కో యంత్రం ధర రూ.95 లక్షల వరకు ఉంది. రైతులు సంఘంగా ఏర్పడి రాయితీ ద్వారా పొందే వీలుంది.
దేశంలో తొలి డ్రోన్ల ప్రాజెక్టుతో పరిశోధనలు
దేశంలో తొలిసారిగా డ్రోన్ల ప్రాజెక్టు ఏర్పాటు చేసి ఏపీలో పరిశోధనలు చేస్తున్నాం.. అధునాతన సాంకేతిక కెమెరాలు, డ్రోన్లు, వాహనాలు సమకూర్చుకుంటున్నాం. ప్రస్తుతం రెండు పంటకాలాల అవసరాలకు తగ్గట్లు అధిక విస్తీర్ణంలో సాగు చేసే పంటలను ఎంచుకుని మందులు పిచికారీ చేస్తున్నాం. వీటికి అధునాతన కెమెరాలు జోడించి మరిన్ని ప్రయోగాలు చేస్తాం.
- డాక్టర్ సాంబయ్య, సీఈవో, డ్రోన్ ప్రాజెక్టు, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం
యంత్రాలతోనే సేద్యం
భవిష్యత్తులో పూర్తిగా యంత్రాలతోనే సేద్యం చేస్తారు. విత్తనం వేసే దగ్గర నుంచి పంట కోత, రవాణా వరకూ వినియోగించడానికి అవసరమైన యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. జయశంకర్ వర్సిటీలో అనేక రకాల నేలలు, వాటిలో పండే పంటల సాగులో వీటిని విరివిగా వాడుతూ పరిశోధనలు చేస్తున్నాం. వాటి వినియోగానికి రైతులకు సూచనలిస్తూ ప్రోత్సహిస్తున్నాం.
- డాక్టర్ జగదీశ్వర్, పరిశోధనా సంచాలకుడు, ఆచార్య జయశంకర్ వ్యవసాయ వర్సిటీ
రైతుల ప్రయత్నాలను వెలుగులోకి తెస్తున్న ‘పల్లెసృజన’
అధునాతన వ్యవసాయ యంత్రాలను పెద్ద పెద్ద కంపెనీలు తయారుచేస్తున్నందున వాటి ధరలు రూ.లక్షల్లో ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే గ్రామాల్లో రైతులు సృజనాత్మకతతో సొంతంగా స్థానికంగా లభించే పరికరాలతో తయారుచేసుకుని వాడుకుంటున్న యంత్రాలను ‘పల్లె సృజన’ అనే స్వచ్ఛంద సంస్థ వెలుగులోకి తెస్తోంది. గత 15 ఏళ్లలో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 400 యంత్రాలను ఇలా రైతుల నుంచి సేకరించినట్లు ఈ సంస్థ అధ్యక్షుడు పి.గణేశం చెప్పారు. వీటిలో వంద యంత్రాలను తయారుచేసి మార్కెట్‌లోకి విడుదల చేసేలా రైతులను ప్రోత్సహించగా 70 వరకూ బాగా అమ్ముడవుతున్నట్లు తెలిపారు. ఇలా యంత్రాలను సొంతంగా తయారుచేసుకుని వాడుకునే రైతులను ప్రభుత్వాలు గుర్తించి ప్రోత్సహించాలన్నారు. పెద్ద కంపెనీలు తయారుచేసేవాటిని రైతులు కొనాలంటే ప్రభుత్వాలు రాయితీలిచ్చి సాయపడాలని సూచించారు.