తెరాస కార్యకర్తల కోసమే సర్కార్ వరద సాయం నగదు రూపంలో పంపిణీ చేసిందని... యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. వరద బాధితుల ఖాతాల్లో నేరుకు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. నిజాం రూపంలో వస్తున్న నయా నిజాం పథకం పారనివ్వకూడదని నగర ప్రజలకు సూచించారు.
ఎంఐఎంతో కలిసి తెరాస ప్రభుత్వం నగరవాసులకు అన్యాయం చేస్తోందని యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. భాజపాకు అధికారం ఇస్తే హైదరాబాద్‌ను భాగ్యనగరం చేస్తామని పునరుద్ఘాటించారు. ఎంఐఎం, తెరాస కలిసి మూసీని పూర్తిగా కబ్జా చేశాయని విమర్శించారు. అవినీతి లేని స్వచ్ఛమైన పాలన కోసం... భాజపాను గెలిపించి... నేరుగా దిల్లీ నుంచి నిధులు తెప్పించుకోవాలన్నారు.
హైదరాబాద్ వాసుల ఉత్సాహం చూస్తే చాలా ఆనందంగా ఉందని యోగి అన్నారు. నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం సర్దార్ పటేల్‌తో సాకారమైందన్న యోగి... దేశవ్యాప్తంగా మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్టికల్-370 తొలిగింపు, రామమందిరం నిర్మాణం వంటి కార్యక్రమాలు... మోదీ, అమిత్ షా చేశారని గుర్తు చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేసీఆర్ ఇళ్లు ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్‌లో పేదలకు 15 లక్షల ఇళ్లు ఇచ్చినట్టు వెల్లడించారు.
ఇదీ చూడండి: గ్రేటర్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రోడ్ షో