United Teachers Association: మెరుగైన పీఆర్సీ కోసం ప్రభుత్వంపైనే తాము పోరాడుతున్నాం తప్ప.. సంఘాల నాయకులపై కాదని ఐక్య ఉపాధ్యాయ సంఘం (యూటీఎఫ్) ప్రధాన కార్యదర్శి ప్రసాద్, రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) అధ్యక్షుడు సుధీర్‌బాబు తెలిపారు. పీఆర్సీ సాధన సమితి నేతలతో విలేకర్ల సమావేశం పెట్టించి, తమపై దాడి చేయిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం వద్ద చర్చల్లో తాము ఏం మాట్లాడామో వీడియో క్లిప్పింగ్‌లు విడుదల చేశారని, సాధన సమితి నేతలు ఏం మాట్లాడారో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. సాధన సమితి నేతలు మంత్రులతో చెవుల్లో గుసగుసలాడడం.. చిట్టీలపై రాసుకొని పంపించుకోవడం.. మంత్రుల కమిటీతో లోపలికి వెళ్లి ఏం చర్చించారో చెబితే బాగుంటుందని నిలదీశారు. విజయవాడలో నిర్వహించిన విలేకర్లతో నిలదీశారు.
నాయకులపై పోలీసుల నిఘా..
‘పీఆర్సీపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు సంతృప్తిగా లేరు. సీఎం జగన్ మాతో చర్చించాలని కోరుతూ నల్లబ్యాడ్జీలు ధరించి, విధులకు హాజరుకావాలని పిలుపునిచ్చాం. ఈ నిరసనలపై ప్రభుత్వం నిర్బంధం విధిస్తోంది. ఉపాధ్యాయులకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేశారు. సంఘ కార్యాలయాల వద్ద పోలీసులను పెట్టి నాయకుల కదలికలను తెలుసుకుంటున్నారు. అంటే అసంతృప్తి ఉందని ప్రభుత్వం గుర్తించినట్లే కదా? సచివాలయంలో సాధన సమితి నేతలు బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశం వెనుక ఏ పార్టీ ఉంది? ఐకాస నాయకుల ఇళ్ల ముట్టడికి మేము పిలుపున్విలేదు. అవసరమైతే సీఎం ఇంటి ముట్టడికి పిలుపునిస్తాం గానీ, ఉద్యోగ నాయకుల ఇళ్ల ముట్టడికి ఎందుకు పిలుపునిస్తాం? కొంతమంది ఉద్యోగులు, ఉపాధ్యాయలు.. సాధన సమితి నాయకుల దిష్టిబొమ్మలకు శవయాత్ర, చిత్ర పటాలకు నివాళులు అర్పించడం లాంటివి చేస్తున్నారు.
ఇది మంచిది కాదని చెప్పాం. 27%కు తగ్గకుండా ఫిట్‌మెంట్ ఇస్తారని ఆశించామని చెప్పాం. సీఎం వద్ద అంగీకరించారు కదా? అది ముగిసిన అధ్యాయం అని మంత్రుల కమిటీ చెప్పింది. ఒక్క శాతం ఫిట్‌మెంట్ వచ్చినా స్కేలు మారి ఉపాధ్యాయులకు మేలు జరుగుతుంది. చర్చలు పూర్తయిన తర్వాత విలేకర్ల సమావేశాన్ని బహిష్కరించి బయటకు వచ్చేశాం. ఉపాధ్యాయులు అసంతృప్తితో వెళ్లిపోయారని ప్రభుత్వ సలహాదారు సజ్జల అప్పుడే చెప్పారు కదా?’ అని యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి ప్రసాద్ అన్నారు.
30% కంటే ఎక్కువ ఫిట్‌మెంట్ ఇస్తారనుకున్నాం..
‘సీఎం జగనే ప్రకటన చేస్తారని మొదటిరోజు చర్చల్లో ఫిట్‌మెంట్‌పై మాట్లాడలేదు. ఫిట్‌మెంట్ 30% కంటే ఎక్కువ ఇస్తారని ఆశించి, నిర్ణయం సీఎంకే వదిలేశాం. రెండోరోజు 23% ప్రకటించి, ఎవర్నీ మాట్లాడనివ్వకుండా లోపలికి వెళ్లిపోయారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనలు, యాప్‌ల భారాన్ని సీఎంకు వెల్లడించాను. సీఎంతో చర్చలు ముగిశాక మేము డైరీ ఆవిష్కరణ చేయించాం. గత కొన్నేళ్లుగా ఇలా చేస్తున్నాం. పీఆర్సీపై అసంతృప్తి ఉండటంతోనే ఉత్తర్వులను భోగి మంటల్లో దహనం చేశాం. ఏపీ ఐకాసలో కొనసాగుతాం. ఫిట్‌మెంట్, గ్రాట్యుటీపై వ్యతిరేకించి, బయటకు వచ్చేశాం. మా వెనుక ఎలాంటి రాజకీయ పార్టీలు లేవు. ఉపాధ్యాయుల ఉద్యమంతోనే నాలుగు ఐకాసలు ఒక్కటయ్యాయి’ అని ఎస్టీయూ అధ్యక్షుడు సుధీర్‌బాబు తెలిపారు.