National cultural Festival: గ్రామీణ కళలను కాపాడుకోవడం సహా కళాకారులను ప్రోత్సహించి, ఆనాటి కళలను పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర సాంస్కృతిక శాఖ జాతీయ సంస్కృతి మహోత్సవాలను నిర్వహిస్తోంది. 17 రోజుల పాటు ఏపీ, తెలంగాణలో అత్యంత వైభవంగా సాగిన ఈ వేడుకలు.. హైదరాబాద్‌లో ముగిశాయి. ఎన్టీఆర్ స్టేడియంలో మూడు రోజుల పాటు సాగిన ఈ వేడుకల్లో.. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. చివరి రోజు విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మీనాక్షి లేఖి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. దేశంలోని అన్ని సంస్కృతుల సమ్మేళనం ఒకే చోట వీక్షించడం ఎంతో మధురమైన అనుభూతిని ఇచ్చిందని మీనాక్షి లేఖి పేర్కొన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను ఎప్పటికీ పరిరక్షించుకోవాలని ఆమె సూచించారు.
"మహిళలు, పురుషులకు మధ్య ఎలాంటి అంతరాలు లేవని మన ఇతిహాసాలు చెబుతున్నాయి. టర్కీ, మధ్య ఆసియా నుంచి వచ్చి మనపై దాడులు చేసిన వారి దృష్టిలో.. మహిళలకు సరైన స్థానం లేదు. ఇలా దాడులు చేసి రాజ్యాలను ఏర్పాటు చేసిన పోర్చుగీసు వారి దృష్టిలోనూ మహిళలకు సరైన స్థానం లేదు. ఇక్కడే పొరపాటు జరిగింది. వారి సంస్కృతిని మనం అవలంభించి.. మన విధానాలను మరచిపోయాం."
- మీనాక్షి లేఖి, విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి
ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసేందుకు మన సంస్కృతి, సంప్రదాయాలే ప్రధాన కారణమని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు అన్నారు. ఇక్కడ జరుగుతున్నవి రాజకీయాలు కావని.. భారత సాంస్కృతిక జాతీయ వాదమని తెలిపారు. భారతీయ సంస్కృతి పరంపర.. మన జీవన విధానంతో పాటు ప్రాణ ప్రధానమైందని ఉద్ఘాటించారు.
కళ కోసం తమ జీవితాలను అంకితం చేసిన పేద, గ్రామీణ కళాకారులు, హస్తకళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో జాతీయ సంస్కృతి మహోత్సవాలను రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించినట్లు.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. భవిష్యత్‌లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ వేడుకలను నిర్వహించి.. కళలను పరిరక్షించడం సహా కళాకారులను ప్రోత్సహిస్తామని ఆయన స్పష్టం చేశారు. జాతీయ సంస్కృతి మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు పలు రాష్ట్రాలకు సంబంధించిన కళాకారుల ప్రదర్శనలు.. సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇదీచూడండి: యాదాద్రిని పర్యాటక కేంద్రంగానూ తీర్చిదిద్దుతాం: మంత్రులు