Kishan Reddy on KCR : ముఖ్యమంత్రి కేసీఆర్ తనపట్ల చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. కేసీఆర్ వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయని.. కానీ ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు తెలిపారు. తాను కేంద్ర మంత్రి కావడం సీఎంకు అసలు ఇష్టం లేనట్లు ఉందన్నారు. ఎన్నో పోరాటాల్లో పాల్గొన్న తనపై చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. ధాన్యం కొనుగోలుపై సంబంధిత కేంద్రమంత్రి చెప్పిన అంశాలపై ప్రజలకు వివరణ ఇచ్చినట్లు చెప్పారు.
తాను మంత్రి అయ్యి రెండున్నరేళ్లు అయిందని.. అప్పటి నుంచి కేసీఆర్‌తో మాట్లాడేందుకు ఎన్నో సార్లు ప్రయత్నించినా.. ఆయన మాట్లాడలేదని కిషన్‌రెడ్డి తెలిపారు. ఎంపీ సంతోశ్తోనూ మాట్లాడానని.. అపాయింట్మెంట్ ఇస్తామన్నారని.. కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదని కిషన్‌రెడ్డి చెప్పారు. ఏ రోజు కూడా దిల్లీకి వచ్చి.. కేంద్రమంత్రి ఉన్నాడు.. తెలంగాణ బిడ్డ ఉన్నాడు.. వారి సహకారం తీసుకుందామని ఎప్పుడూ తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేయలేదన్నారు. కేసీఆర్ మాటలకు, తిట్లకు భయపడే వ్యక్తిని తాను కాదని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి పదని తనకు ముఖ్యంకాదని.. తన పార్టీ, జెండా, తెలంగాణ ప్రజలే తనకు ముఖ్యమన్నారు.
'ఆకాశం ఉడిపడినట్లు, నేల బద్దలైనట్లు, తెరాస ప్రభుత్వం కూలిపోయినట్లు మాట్లాడారు. కేసీఆర్ అభద్రతాభావంతో ఉన్నారు. అందువల్లనే అట్లా మాట్లాడి ఉంటారు. నేను మంత్రికావడం ఆయనకు ఇష్టం ఉన్నదో లేదో. నేనంటే కేసీఆర్‌కు కోపమో బాధో అర్థం కాదు.' - కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి
కేసీఆర్ ఏమన్నారు..
kcr on kishan reddy: కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం (నవంబర్ 29) ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కేంద్ర ప్రభుత్వం, కిషన్‌రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని భాజపా.. రైతు వ్యతిరేక విధానాన్ని అవలంభిస్తోందని మండిపడ్డారు. వారి నిర్ణయాలన్నీ మధ్యతరగతి ప్రజలపై భారం వేసేవేనని ఆరోపించారు. రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి.. బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఉండి కూడా రాష్ట్రానికి ప్రయోజనం లేదన్న కేసీఆర్.. కిషన్‌రెడ్డికి దమ్ముంటే కేంద్రంతో ధాన్యం కొనిపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వాతావరణం బాయిల్డ్ రైస్‌కే అనుకూలమని వాదన వినిపించాలని సూచించారు.
సంబంధిత కథనం..
CM KCR PC: 'దమ్ముంటే బాయిల్డ్ రైస్ కొనిపించు.. కిషన్‌రెడ్డి'