Amith shah Comments: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర పదవుల కోసం కాదని.. తెలంగాణ నిజాం ప్రభువును గద్దె దించేందుకేనని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. రజాకార్ పాలన నుంచి విముక్తి కల్పించేందుకే సంజయ్ యాత్ర చేపట్టారని స్పష్టం చేశారు. ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహించిన భారీ బహిరంగసభలో ప్రసంగించిన అమిత్‌షా.. తెరాస ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ చెప్పిన నీళ్లు, నిధులు, నియామకాలు జరిగాయా..? అని ప్రశ్నించారు. భాజపా గెలిస్తే నీళ్లు, నిధులు, నియామకాలు హామీ నెరవేరుతుందని హామీ ఇచ్చారు. ధాన్యం కొనట్లేదని కేంద్రంపై తెరాస నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని అమిత్ షా మండిపడ్డారు. ఎంఐఎం, తెరాస పార్టీలు అవిభక్త కవలలన్నారు. తెరాస కారు స్టీరింగ్... ఎంఐఎం చేతిలో ఉందని ఆరోపించారు. రాష్ట్రంలోని అవినీతి సర్కార్‌ను గద్దె దించేందుకు యువత కదిలి రావాలని అమిత్‌షా పిలుపునిచ్చారు.
"ఇంత అవినీతి ప్రభుత్వాన్ని నా జీవితంలో చూడలేదు. రెండు పడక గదుల ఇళ్లను కేసీఆర్ ఎంతమందికి ఇచ్చారు..? నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాని ఆవాస్ యోజనను రాష్ట్రంలో అమలు చేయడం లేదు. ఆయుష్మాన్ భారత్ తెలంగాణలో ఎందుకు అమలు కావట్లేదు. పేదలకు రూ.5 లక్షల వైద్యం సహాయం అందే పథకాన్ని నిలిపివేశారు. రూ.లక్ష రుణమాఫీ చేస్తామని ఒక్కరికీ చేయలేదు. హైదరాబాద్‌లో 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తామని ప్రజల్ని మోసం చేస్తున్నారు. గాంధీ, ఉస్మానియాను పట్టించుకోని సీఎం.. కొత్తగా నిర్మిస్తారా..? కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు, ఫొటోలు మార్చి అమలు చేస్తున్నారు. సమగ్ర శిక్ష అభియాన్ కింద నిధులిస్తే.. దానిని మన ఊరు-మనబడి అంటున్నారు. రాష్ట్రంలో కేసీఆర్ హత్యారాజకీయాలు మొదలుపెట్టారు. భాజపా కార్యకర్త సాయిగణేశ్‌ను పొట్టనపెట్టుకున్నారు. పాలమూరు ప్రాజెక్టులను కేసీఆర్ ఎందుకు పూర్తి చేయట్లేదు. రాష్ట్రంలో కమీషన్లు వచ్చే ప్రాజెక్టులనే కేసీఆర్ పూర్తిచేస్తారు. ఎంఐఎంకు భయపడి తెలంగాణ విమోచనదినాన్ని ఈ ప్రభుత్వం జరపలేదు. కేసీఆర్ తరిమేందుకు ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు. బండి సంజయ్ 45 డిగ్రీల ఎండలో 660 కి.మీ. నడిచారు. కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా మీ వెంట మేముంటాం." - అమిత్‌షా, కేంద్ర హోంశాఖ మంత్రి
ఇవీ చూడండి: