Home Affairs meeting which ended incompletely: రాష్ట్ర విభజనలో పరిష్కారం కాని అంశాలు, సమస్యలపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో సుమారు రెండు గంటల పాటు జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధికారులు పలు అంశాలు లేవనెత్తారు. ఇరురాష్ట్రాలు తమ వాదనలకే కట్టుబడి ఉన్నారు. ఇరు రాష్ట్రాల అధికారులు తమ తమ అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. విభజనచట్టంలో పేర్కొన్న సంస్థలను షీలాబిడే సిఫార్సుల ప్రకారం జనాభా ప్రాతిపదికన పంచాలని ఆంధ్రప్రదేశ్ అధికారులు కోరగా, అందుకు తెలంగాణ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిసింది.
హెడ్‌క్వార్టర్స్ అనే పదంపై ఇంకా స్పష్టత లేదు: 'హెడ్‌క్వార్టర్స్' అన్న పదంపై స్పష్టత కోసం న్యాయస్థానంలో కేసులు దాఖలయ్యాయని, అవి తేలేవరకు షెడ్యూల్‌లోని సంస్థల విభజనకు షీలాబిడే కమిటీ సిఫార్సులు అమలు చేయడానికి వీల్లేదని స్పష్టంచేశారు. షెడ్యూల్10లోని ఆస్తులు ఎక్కడున్నవి ఆ రాష్ట్రానికే చెందుతాయని నగదును మాత్రం జనాభా నిష్పత్తి ప్రకారం పంచుకోవాలని ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పుఇచ్చిందని తెలంగాణ అధికారులు పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా కేంద్ర హోంశాఖ జారీచేసిన మౌఖిక ఆదేశాలను యథాతథంగా అమలు చేయాలని.. అందులో మార్పులు చేయడానికి వీల్లేదని తెలంగాణ అధికారులు చెప్పినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను విభజన చేయాలని ఆంధ్రప్రదేశ్ అధికారులు కోరగా అలా చేయాలంటే 'హెడ్‌క్వార్టర్'కి నిర్వచనం తేలాల్సి ఉందని తెలంగాణ అధికారులు పేర్కొన్నారు. ఆ సంస్థ పాలకమండలిని పునర్వ్యవస్థీకరించాలని తెలంగాణ ప్రభుత్వం 2016 మే నెలలోనే కేంద్ర హోంశాఖకు విజ్ఞప్తి చేసిందని కానీ ఇప్పటివరకు జరగలేదని హోం శాఖ కార్యదర్శికి తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన పాలకమండలి ఏకపక్షంగా ఆ సంస్థ విభజన ప్రణాళిక తయారుచేసి కేంద్రానికి ఆమోదం కోసం పంపిందని ఫిర్యాదుచేశారు.
ఆస్తుల పంపంకంలో అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ: ఏపీఎస్ఫ్సీ రంగారెడ్డి జిల్లాలోని 238 ఎకరాల భూమిని తెలంగాణ స్వాధీనం చేసుకోవడంపై ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించిందని తెలిపారు. 2015 నవంబర్‌లో యధాతథ స్థితి కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చిందని గుర్తుచేశారు. ఇప్పటికీ ఆ విషయం కోర్టులో పెండింగ్‌లో ఉన్నట్లు తెలంగాణ వివరించింది. ఆంధ్రప్రదేశ్ అధికారులు ఆ భూమి విషయాన్ని పక్కనపెట్టి, మిగిలిన ఆస్తుల విభజన పూర్తిచేయాలని కోరగా తెలంగాణ అందుకు అభ్యంతరం వ్యక్తంచేసింది.
క్యాష్ క్రెడిట్ బకాయిలపై ఇరు రాష్ట్రాలు అభ్యంతరం: అందులోనూ హెడ్‌క్వార్టర్ నిర్వచనం ఇమిడి ఉన్నందున, వివాదంలో ఉన్న భూములను హెడ్క్వార్టర్ ఆస్తుల కింద పరిగణిస్తారా? లేదా? అన్నది తేల్చాల్సి ఉందని అంతవరకు ఆ అంశంపై ముందుకెళ్లకూడదని కోరారు. ఆ సమయంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి స్పందిస్తూ హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులను దృష్టిలో ఉంచుకొని కేసును పరిశీలించాలని సిబ్బందికి సూచించారు. పౌరసరఫరాల కార్పొరేషన్ విభజనకు ముందు తెలంగాణ పౌరసరఫరాల సంస్థ ఉపయోగించుకున్న క్యాష్ క్రెడిట్ బకాయిలు చెల్లించేలాచూడాలని ఏపీ అధికారులు కోరగా, తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తంచేశారు.
సెక్షన్ 50, 51, 56 లోపాలు సరిదిద్దాలి: కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ఆహారసబ్సిడీ మొత్తంలో తెలంగాణ వాటాను బదిలీచేస్తామని ఏపీ పౌరసరఫరాల కార్పొరేషన్ లిఖితపూర్వక హామీ ఇస్తేనే ఆ క్యాష్ క్రెడిట్‌కు సంబంధించిన మొత్తాన్ని చెల్లిస్తామని తెలంగాణ అధికారులు షరతు పెట్టారు. విభజనచట్టంలోని సెక్షన్ 50, 51, 56 కింద ఉన్న పన్ను విషయాల్లోని లోపాలు సరిదిద్దుతూ విభజన చట్టాన్ని సవరించాలని ఆంధ్రప్రదేశ్ కోరింది. అందులో పన్ను రీఫండ్స్ ఏవైనా ఉంటే అవి ఆ ప్రాంతానికే చెందుతాయని ఒకవేళ పన్ను బకాయిలుంటే రెండు రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికన చెల్లించాలని చెప్పారని తద్వారా రీఫండ్లలో ఎక్కువ భాగం తెలంగాణకు వెళ్తుంటే, బకాయిల్లో ఎక్కువభారాన్ని ఏపీ ప్రభుత్వం భరించాల్సి వస్తోందని పేర్కొన్నారు.
నీతిఆయోగ్ లెక్కలు: ఆ లోపాన్ని సరిదిద్దుతూ చట్టసవరణ చేయాలని ఏపీ అధికారులు కోరగా తెలంగాణ ససేమిరా అంది. తెలంగాణ ఏర్పాటైన 8 ఏళ్ల తర్వాత చట్టాన్ని సవరించడం కుదరదని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏడువెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధుల గురించి తెలంగాణ అడగ్గా నీతిఆయోగ్ ఐదేళ్లకాలానికే ఆ నిధులు సిఫార్సు చేసిందని ఇప్పటికే ఆ మొత్తం ఇచ్చామని కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు చెప్పినట్లు తెలిసింది. ఇప్పటి వరకు 1,750 కోట్లు విడుదల చేస్తే రాష్ట్రప్రభుత్వం 1,049 కోట్లకే వినియోగ ధ్రువీకరణ పత్రాలు యూసీ ఇచ్చిందని, మిగిలిన లెక్కలుచెప్పిన తర్వాతే తదుపరి విషయం పరిశీలిస్తామని పేర్కొన్నట్లు సమాచారం.
కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు, ఉమ్మడి సంస్థల ఖర్చులు, విదేశీ ఆర్థికసాయంతో చేపట్టే ప్రాజెక్టుల కోసం తీసుకున్న రుణాల పంపిణీపై సమావేశంలో చర్చ జరిగింది. సమస్య పరిష్కారంకోసం కాగ్ సాయం తీసుకోవడానికి రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. సమావేశంపై ఏపీ ప్రభుత్వ అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. సానుకూలంగా జరిగిందని, మూడు, నాలుగు అంశాల్లో తమకు అనుకూలంగా ఉత్తర్వులు రావొచ్చని ఓ అధికారి అభిప్రాయపడ్డారు. హోంశాఖ కార్యదర్శి ఆదర్యంలో జరిగిన చర్చల్లో తెలంగణ వినిపించిన వాదనల గురించి తెలంగాణ అధికారులు ఐదు పేజీల పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ఇవీ చదవండి: